సీఎం జగన్ చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తు తన అన్న సీఎంగా ఉన్న రాష్ట్రంలో తన తండ్రి కేసు విచారణలో జాప్యం జరగడంపై వివేకా కూతురు వైయస్ సునీత రెడ్డి పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ కేసు విషయంలో సునీత సుప్రీం కోర్టు తలుపు తట్టిన తర్వాతే సీబీఐ విచారణ వేగవంతమైంది.
జగన్ సీఎం గా ఉన్నప్పటికీ కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందంటూ విలేకరులు గతంలో సునీతను ప్రశ్నించగా…ఆ విషయం జగన్ నే అడగాలంటూ సునీత షాకింగ్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన తండ్రి హత్య కేసుపై వైయస్ సునీతా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో వైయస్ సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేపుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసు విచారణకు పరిస్థితులు అనుకూలంగా లేవంటూ ఆ పిటిషన్లో ఆమె పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని సునీత సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఈ కేసులో కీలకమైన సాక్షులను బెదిరిస్తున్నారని, కడపలో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని కూడా ఆ పిటిషన్ లో సునీత పేర్కొన్నారు.
అందుకే, ఈ కేసు విచారణను ఏపీ హైకోర్టు పరిధిలో కాకుండా తెలంగాణ హైకోర్టు పరిధిలో జరిపేలా ఆదేశాలివ్వాలని ఆమె సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలోనే సునీత తరఫు న్యాయవాదుల వాదనలను విన్న సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 14కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. సునీత తాజా నిర్ణయంతో జగన్ ఈ కేసుపై ఏ విధంగా స్పందిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని విమర్శలు వస్తున్నాయి.