వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీ రామ్ గోపాల్ వర్మ సినిమాలాగా గందరగోళంగా మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సీఎం జగన్ సోదరుడు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు ఖాయమని అంతా భావించారు. కానీ, ఈ నెల 25 వరకు అవినాష్ ను అరెస్టు చేయొద్దని, సీబీఐ విచారణకు అవినాష్ హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణకు అవినాష్ సహకరించాలని.. సీబీఐ అధికారుల ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలని, అవినాష్ విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది.
అయితే, అనూహ్యంగా హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అవినాష్ రెడ్డిమధ్యంతర బెయిల్‌ను సవాల్ చేస్తూ అత్యవసర విచారణ చేయాలని కోరారు. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేస్తామని తెలిపింది. మరోవైపు, ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి,గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిలు కూడా బెయిల్ కావాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినా, సీబీఐ అరెస్ట్ చేసిందని పిటిషన్ లో ప్రస్తావించారు. తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి కోరారు. తామే వివేకాను హత్య చేశామనడానికి ఆధారాలు లేవని, గూగుల్ టేక్ ఆవుట్ లొకేషన్ ఆధారంగా సీబీఐ అరెస్ట్ చెయ్యడం సరికాదని చెప్పారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
ఈ క్రమంలోనే సునీతా రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశంసలు గుప్పించారు. కంటే కూతురునే కనాలి అని ఆయన కొనియాడారు. హైకోర్టు తీర్పుపై ప్రజలు పెదవి విరుస్తూ ఉండొచ్చని… కానీ, నాయస్థానాన్ని నమ్మాలని ఆయన చెప్పారు. సునీత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని అవినాష్ రెడ్డి ఊహించలేదని వ్యాఖ్యానించారు.
సాక్షి మీడియాలో వచ్చేవన్నీ నీచమైన కట్టు కథలని, చంద్రబాబు, సీబీఐ, కుమ్మక్కయ్యారంటూ సజ్జల, వైసీపీ నేతలు అంటున్నారని మండిపడ్డారు. ఒకవేళ అదే నిజమైతే జగన్ బయట తిరిగేవారా, కోర్టుకు వెళ్లకుండా ఉండేవారా అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు రఘురామ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.