సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు దాదాపుగా ఖాయం అనుకుంటున్న తరుణంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సమ్మర్ వెకేషన్ కారణంగా ఈ బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హై కోర్టు వాయిదా వేసింది.
అవసరమైతే స్పెషల్ వెకేషన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ తీసుకువెళ్లాలని సీబీఐ అధికారులకు సూచించింది. ఆ తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు అయింది. అయితే, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే గంగిరెడ్డికి మళ్లీ బెయిల్ మంజూరు చేయాలన్న ఆదేశాలపై వివేకా కూతురు సునీత రెడ్డి తాజాగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వులలో షరతులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. గంగిరెడ్డికి మరోసారి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించి ప్రలోభపెట్టి తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని సునీత అనుమానం వ్యక్తం చేశారు. దీంతో, సునీత పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దానిపై దేశపు అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.