మంత్రి కేటీఆర్ కు కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో, తనను డాక్టర్లు మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోమన్నారని, ఈ సమయంలో చూసేందుకు ఓటీటీ కంటెంట్ ను సూచించాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో, చాలామంది కేటీఆర్ కు అనేక సినిమాలను, వెబ్ సిరీస్ లను సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా కొన్ని సినిమాలు సూచిస్తూ సెటైర్లు వేశారు.
కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకున్న షర్మిల….కుట్ర సిద్ధాంతం:క్లౌడ్ బరస్ట్, నీటమునిగిన ఇళ్ళు, మరియు పంప్ హౌస్ లు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు వైయస్ షర్మిల. దీంతో, వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే కేటీఆర్ పై షర్మిల మండిపడ్డారు. ఓటీటీలో సినిమాల గురించి సలహా అడిగితే వెటకారంగా స్పందించామని, దాంతో చిన్న దొరగారికి మాపై చాలా కోపం వచ్చిందని… తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారని ఫైర్ అయ్యారు.
తనను వ్యక్తిగతంగా విమర్శించడానికి సిగ్గు లేదా అంటూ కేటీఆర్‌ని వైఎస్ షర్మిల ప్రశ్నించడం సంచలనం రేపుతోంది. ఓటీటీలో సినిమాలు చూడటం కాదని, దమ్ముంటే తాము వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంట్లో కూర్చొని వరద ప్రాంతాల్లో సహాయకచర్యలను రిమోట్‌గా పని చేయలేరా అంటూ కేటీఆర్‌కి షర్మిల కౌంటర్ ఇచ్చారు. కరోనా సమయంలో అందరం రిమోట్ గా పని చేయలేదా? అని నిలదీశారు.
వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారా? అని దుయ్యబట్టారు. వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలతో తనకు మండిందని చెప్పారు. మరి, షర్మిల వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.