రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిల పార్టీ పెట్టారు. తన తండ్రి పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. గతేడాది నుంచి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఊహించనంత మైలేజీ మాత్రం రావడం లేదు.
నిరుద్యోగ దీక్షలు, పాదయాత్ర, రైతు దీక్షలు అంటూ ఆమె ఎప్పుడూ ఏదో ఒక విషయంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ పార్టీని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఓ క్లారిటీ లేదు..
తెలంగాణలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీ చేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె రాజకీయాలంటూ.. పార్టీ అంటూ ఎందుకంత కష్టం పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాదాపు ఎనిమిది నెలలుగా ఆమె పడుతున్న కష్టమంతా వృథా అనే టాక్ ఉంది.
పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై ఆమె ఓ క్లారిటీ ఉన్నట్లు కనపడడం లేదు. కేవలం తన వాగ్ధాటితోనూ, వైఎస్‌పై అభిమానంతోనూ ఓట్లు వచ్చి పడతాయని ఆమె ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలకు బయటకు వెళ్లిపోయారు.
అవి ఎందుకు పోగొట్టుకోవాలని..
మరోవైపు అన్న జగన్‌తో విభేదాలతో షర్మిల పార్టీ పెట్టారని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆమెకు జగన్ సహకారం లేదు. దీంతో కొంతమంది నాయకులు షర్మిల పక్షాన నిలబడేందుకు వెనకడగు వేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. అప్పటిలోపు నియోజకవర్గాల వారీగా బలమైన నేతలు పార్టీకి దొరకడం కష్టం. అందుకే అసలు ఎన్నికలకు వెళ్లాలా? వద్దా అనే సందేహంలో షర్మిల ఉన్నట్లు తెలిసింది.
ఇంత తక్కువ సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం అసాధ్యం. అందుకే ఈ విషయంపై తన సన్నిహితులు, ముఖ్యులతో షర్మిల చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఎన్నికల బరిలో దిగి పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు పోగొట్టుకోవడం ఎందుకు అనే ఆలోచనలో ఆమె ఉన్నారని తెలిసింది. మరి షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.