దివంగత మహానేత వైఎస్సార్ కుమార్తె, సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఓ తెలుగు దినపత్రిక ప్రచురించిన వ్యాసం సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతున్నారని, దానికి తెలంగాణ వైఎస్సార్ పార్టీ అని పేరు పెట్టబోతున్నారని ఆ కథనం సారాంశం.
అంతేకాదు, జగన్ కు, షర్మిలకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని, అందుకే, ఆమె తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకుంటున్నారని ఓ వర్గం మీడియా కోడై కూస్తోంది. ఇక, అన్న జగన్ కు పోటీగా చెల్లెలు షర్మిల కొత్త పార్టీ అని, జగన్ వద్దని వారించినా ఆమె వినకుండా పార్టీ పెడుతున్నారని, ఆ పార్టీకి వైఎస్ విజయమ్మ మద్దతు కూడా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే, ఆ పత్రిక రాసిన కథనంలో వాస్తవం ఎంత? కొత్త పార్టీపై షర్మిలగానీ, విజయమ్మగానీ వెల్లడించారా? అన్న ప్రశ్నలేవీ పట్టని నెటిజన్లు….ఈ విషయంపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంపై కొన్ని రోజులుగా ఇటు ఆంధ్రా, అటు తెలంగాణలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ కథనంపై స్వయంగా వైఎస్ షర్మిల స్పందించారు.
ఆ కథనాన్ని ఖండిస్తూ షర్మిల ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తాను కొత్తపార్టీ పెడుతున్నాననంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం అని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్సార్ గారి కుటుంబాన్ని కించపరిచే దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని టార్గెట్ చేసేలా ఆ పత్రికలో రాతలు ఉంటున్నాయని షర్మిల మండిపడ్డారు.
ఏ పత్రిక అయినా, ఏ చానెల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడం నీతిమాలిన చర్య అని షర్మిల నిప్పులు చెరిగారు. ఆ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, అవాస్తవాలను రాసిన పత్రిక, చానెల్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని షర్మిల హెచ్చరించారు.
అంతా ఓకే గాని… అంత సంచలన కథనం… ప్రతి టీవీలో మారుమోగితే… కుటుంబ సభ్యులు ఎన్నో ఫోన్లు కూడా చేసి ఉంటారు. ఆలస్యంగా దృష్టికి రావడంలో మతలబు ఏమిటోమరి !