నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షో రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్ లోనే హోస్ట్ గా అదరగొట్టిన బాలయ్య మలి సీజన్ లోనూ అదే ఊపును కొనసాగిస్తున్నారు. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ లను బాలయ్య ఇంటర్వ్యూ చేసిన వైనం వైరల్ గా మారింది. ఇక, రెండో ఎపిసోడ్ లో యంగ్ హీరోలు విశ్వక్సేన్, సిద్దులను ఇంటర్వ్యూ చేసిన బాలయ్య సరదా ప్రశ్నలతో వారిద్దరిని ఇరకాటంలో పడేశారు. ముచ్చటగా మూడో ఎపిసోడ్ లో అడవి శేష్, శర్వానంద్ లను ఆటపట్టించిన బాలయ్య త్వరలోనే మరో పొలిటికల్ లీడర్ తో ఎపిసోడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
సినీ నటిగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత పొలిటిషన్ గా మారిన రోజా…. బాలయ్య షోలో సందడి చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఆ ప్రచారం సద్దుమణగక ముందే తాజాగా ఈ షోకు ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హాజరు కాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అల్లు అరవింద్ చర్చలు జరుపుకున్నట్టుగా కూడా టాక్ వస్తుంది. ఇక, ఈ షోలో పాల్గొనడం ద్వారా తన పార్టీకి సంబంధించిన ప్రమోషన్ కూడా చేసుకోవచ్చని షర్మిల భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఏది ఏమైనా ఈ షోకు వైఎస్ షర్మిల హాజరైతే అది మరోసారి ఇది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజేయడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అయితే, మంత్రి రోజా గానీ వైఎస్ షర్మిల గాని ఈ షోలో పాల్గొనే విషయంపై ఆహా టీం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.