వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద ఉద్రిక్తి పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నారావుపేట మండలం లింగగిరిలో లంచ్ బ్రేక్ సమయంలో షర్మిల కాన్వాయ్ లోని బస్సుకు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు పెట్టడంతో వైఎస్సార్ టీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
అంతేకాదు, షర్మిల పాదయాత్ర వాహనాలపై రాళ్లు రువ్వి పలు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, వైఎస్సార్ టీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు.
అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన కామెంట్ల వల్లే ఈ గొడవ జరిగిందని తెలుస్తోంది. దీంంతో, వైఎస్సార్ టీపీ ఫ్లెక్సీలను చించివేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు..బస్సుకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై షర్మిల స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలో భాగంగానే బస్సును తగలబెట్టారని ఆరోపించారు. అన్ని అనుమతులు తీసుకుని పాదయాత్ర చేస్తున్నామని పోలీసులకు చెప్పినా వినలేదని ఆరోపించారు.
శాంతిభద్రతల సమస్యను చూపించి తనను అరెస్ట్ చేసి పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను పనోళ్లలాగా వాడుకుంటున్నారని షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు.
https://youtu.be/USP4Q1lot6Q