ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అన్నమయ్య జిల్లాలో నమోదు అయిన కేసుల్లో భాగంగా పోలీసులు పోసానిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే పోసాని అరెస్ట్ ను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు జగన్ సైతం పోసాని విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పోసాని భార్య కుసుమలతను ఫోన్ లో జగన్ పరామర్శించారు.
పోసానికి వైసీపీ అండగా ఉంటుంది.. మేమంత మీకు తోడుగా ఉంటాం.. పార్టీ తరపున న్యాయ సహాయం అందిస్తామని జగన్ భరోసా కల్పించారు. పోసాని అరెస్టు అక్రమమని.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతుందని.. భయపడొద్దంటూ కుసుమలతకు ధైర్యం చెప్పారు. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని లీగర్ టీమ్‌ను పోసాని కోసం పంపించారు. అయితే ఇంతకుముందు ఏ నేత అరెస్టు విషయంలోనూ జగన్ ఇంతగా రియాక్ట్ అవలేదు.
కొద్దిరోజుల క్రితం వైసీపీలో కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో జగన్ నోరు మెదపలేదు. అరెస్ట్ అయిన రెండు రోజులకు జైలుకు వెళ్లి వంశీని పరామర్శించారు. కానీ ఇప్పుడు పోసాని కృష్ణ మురళి కోసం జగన్ నేరుగా రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి జగన్ కు మద్దతుగా నిలిచే అతి కొద్ది మందిలో పోసాని ఒకరు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ.. చంద్రబాబును నోటికొచ్చిన బూతులు తిడుతూ జగన్ పై స్వామి భక్తి చాటుకున్నారు పోసాని. ఫలితంగా 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే పోసానికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు జగన్. దాంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై పోసాని మరింతగా విరుచుకుపడుతూ వచ్చారు.
ఇక 2024లో వైసీపీని ఘోరంగా ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది. ఫ్యాన్ పార్టీ నేతలపై వరసగా కేసులు నమోదు అవ్వడం ప్రారంభం అయ్యాయి. దాంతో కొంత సైలెంట్ అయిన పోసాని.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ జగన్ తాజాగా పోసానికి అండగా నిలిచారు. ఇందుకు కారణం కమ్మ సామాజిక వర్గమని ప్రచారం జరుగుతుంది. ఇటీవల వంశీ అరెస్ట్ సమయంలో జగన్ సైలెంట్ గా ఉండడంతో ఆ సామాజిక వర్గంలో ఆయన పై కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన పోసాని అరెస్ట్ అవ్వడంతో తన పొరపాటున సరిదిద్దుకునేందుకు నేరుగా జగన్ రంగంలోకి దిగారట. కమ్మ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకే పోసాని విషయంలో జగన్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారని టాక్ నడుస్తోంది.