ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించిన కాలంలో సంచలనంగా మారిన కొన్ని కేసుల్లో ఒకటి.. నాటి పాలక మండలి సభ్యుడిగా వ్యవహరించిన జె.శేఖర్ రెడ్డి నివాసంలో పెద్ద నోట్లను భారీగా కనుగొన్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో ఐదుగురు పైనా కేసులు నమోదయ్యాయి.
పాతనోట్ల మార్పిడి వ్యవహారంలో ఆయన అధికారులకు దొరికిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.
పారిశ్రామికవేత్తగా సుపరిచితుడైన ఆయన ఇంట్లో.. అప్పటికే రద్దు అయిన వెయ్యి నోట్లు పెద్ద ఎత్తున శేఖర్ రెడ్డి కార్యాలయంతో పాటు.. ఆయనకు సంబంధించిన నివాసాల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకున్న పరిచయాలతో పాత నోట్లను పెద్ద ఎత్తున మార్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఈ వ్యవహారంపై పోలీసులు.. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే.. నాటి ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవంటూ సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
సాక్ష్యాలు లేనందున.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పైనా కేసులు మూసి వేయొచ్చని సీబీఐ తేల్చింది. ఈ మేరకు చెన్నై సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి ఎస్. జవహర్ తీర్పు నిచ్చారు. వాస్తవానికి.. ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు ప్రభుత్వంపై నాటి విపక్షంగా వ్యవహరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు చేశారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. శేఖర్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలు సామాన్యమైనవి కావు. ప్రభుత్వానికి రూ.247.13 కోట్ల మేర నష్టం కలిగేలా చేశారన్న ఆరోపణ ఉంది. కానీ.. వాటిల్లో వేటికి సంబంధించి కూడా సీబీఐ ఆధారాలు చూపించలేకపోయింది. ఇదంతా చూస్తున్నప్పుడు.. బాబు హయాంలో జగన్ చేసిన ఆరోపణలతో పాటు.. తాజాగా చేస్తున్న ఆరోపణలు.. కేసుల పరిస్థితి కూడా ఇదే తీరులో ఉండనుందా? అన్నది ప్రశ్నగా మారింది.
కేవలం సమాచారం ఆధారంగా కేసులు నమోదు చేస్తే ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెబుతున్నారు. ఆరోపణలకు తగ్గట్లుగా సాక్ష్యాలు.. ఆధారాలు ఉంటే తప్పించి నేరాన్ని నిరూపించటం అంత తేలికైన విషయం కాదు.
అప్పట్లో వైసీపీ నేతలు, సాక్షి టీవీ చేసిన ఆరోపణలు
శేఖర్ రెడ్డి ని జగన్ మళ్లీ తన వాడిగా చేసుకుని పదవిని కట్టబెట్టిన అనంతరం అతనిపై వచ్చిన ఒక కథనం ఇది