ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత, ఏపీ వైసీపీ నాయకుల పేర్లు బయటకు రావడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్ భారతి, విజయసాయిరెడ్డి కూడా ఈ స్కాంలో ఉన్నట్టు టీడీపీ ఆరోపించింది. అంతేకాదు సంచలన విషయాన్ని ఆధారాలతో సహా చెప్పే ప్రయత్నం చేసింది.
ఢిల్లీలో తీగ లాగితే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతాయని తెలుగు దేశం పార్టీ నేత ఆనం వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. అదాన్ డిస్టిలరీస్ అక్రమంగా సంపాదించిన 5,000 కోట్ల రూపాయలను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉపయోగించారని ఆరోపించారు.
ఈ స్కామ్‌లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా బయటికి వచ్చినా ఆమె ప్రమేయం లేదని కొట్టిపారేశారు. జగతి పబ్లికేషన్స్ మరియు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ (లిక్కర్ స్కామ్‌లో ప్రధాన లబ్ధిదారు)లకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
క్విడ్ ప్రోకో ఒప్పందంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ జగతి పబ్లికేషన్స్‌కు నిధులు మళ్లించిందని వెంకటరమణారెడ్డి అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డితో ఆర్థిక సంబంధాలున్న పనక శరత్‌రెడ్డిని సీబీఐ విచారిస్తోందన్నారు.
జగన్ తన లావాదేవీల కోసమే దావోస్ వెళ్లారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డి పాత్ర ఉందని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. వాటికి సంబంధించిన కొన్ని కంపెనీల వివరాలను ఆయన బయటపెట్టారు.