ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి …ప్రముఖ ఇండస్ట్రియలిస్టుగా ఆమెకు దేశవ్యాప్తంగా పేరున్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఒకవైపు మీడియారంగంలోనూ.. మరోవైపు పారిశ్రామికరంగంలోనూ.. భారతి రాణిస్తున్నారు. సాక్షి పత్రిక, టీవీలకు ఆవిడే కీలకం. అదేసమయంలో సిమెంట్లు.. స్పిన్నింగ్ మిల్స్.. విద్యుత్ పరిశ్రమలకు కూడా ఆవిడే అన్నీ అయి చూస్తున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ కుటుంబ వ్యాపారాలు.
అయితే.. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకముందు.. జగన్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి భారతిరాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తుంటే.. కడపలో వైసీపీ తరఫున ఇంటింటికీ తిరిగారు.. భారతి. తన భర్తను గెలిపించాలని కాదు.. వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసినా.. వారిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా కడప మొత్తంగా ఆమె గత ఎన్నికలకు ముందు ప్రచారంలో దూకుడు చూపించారు.
ఇక, ఇప్పుడు ప్రభుత్వంలోనూ భారతి కీలకంగానే ఉన్నారు. అయితే.. ప్రత్యక్షంగా ఎలాంటి కార్యక్రమాల్లో నూ పాల్గొనే అవకాశం లేకుండా.. పరోక్షంగా మాత్రం కొన్ని విషయాల్లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారని సమాచారం. కొన్నాళ్ల కిందట జగన్‌పై ఉన్న కేసుల్లో సీబీఐ దూకుడు పెంచగానే.. ఆయన జైలుకు వెళ్లిపోయే పరిస్థితి ఉంటుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఒకవేళ అదే జరిగితే.. ఆయన ప్లేస్‌ను భారతి తీసుకుంటారని కూడా ప్రచారంలోకి వచ్చింది.
ఇక, తాజాగా వైసీపీ వర్గాల్లో జరుగుతున్న గుసుగుసను బట్టి.. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భారతి గట్టిగా నిర్ణయించుకున్నారని సమాచారం. కీలకమైన.. పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీ చేస్తుండగా.. రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి భారతి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం వైసీపీలోనూ చర్చనీయాంశంగా మారింది. తద్వారా.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి.. తన సత్తానిరూపించాలని.. పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని భారతి చూస్తున్నారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.