జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. కొందరు బూతులు మాట్లాడుతూ చెప్పులు చూపిస్తున్నారని జగన్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా జగన్ కామెంట్లున్నాయని యనమల సెటైర్లు వేశారు. ఫ్యాక్షనిస్టు నోట సోషలిజం సూక్తులు వినాల్సి రావడం సిగ్గుచేటని చురకలంటించారు.
ఇడుపులపాయలో వేల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసిన జగన్, నగరానికో ప్యాలెస్ (బెంగళూరు ఎలహంక, హైదరాబాద్ లోటస్ పాండ్, పులివెందుల, తాడేపల్లి) నిర్మాణమే సోషలిజనుకుంటున్నారని చురకలంటించారు. ఏళ్ల క్రితమే ఏపీలో అంతరించిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్లీ విస్తరిస్తూ రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తున్న జగన్ సోషలిజం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జగన్ ఎంతటి ప్రజాస్వామ్యవాదో అందరికీ తెలుసని యనమల అన్నారు. సెక్రటేరియట్ కు వెళ్లడానికే ముఖం చెల్లని జగన్…ఆయన కూర్చోమంటే కూర్చునే పప్పెట్ మంత్రులు, అద్దె మైకు ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యమా? అని పంచ్ లు వేశారు. జగన్ లో మచ్చుకైనా ప్రజాస్వామ్య లక్షణాలున్నాయా? విలువల గురించి జగన్ మాట్లాడడానికి మించిన బూతు మరొకటి ఉందా? అని ప్రశ్నించారు.
చెల్లెలిని రోడ్ల పాలు చేసి రాష్ట్రం నుంచి, తల్లిని పార్టీ నుండి, ఇంటి నుండి గెంటేయడమే జగన్ పాటించే విలువలా? అని నిలదీశారు. చిన్నాన్నను చంపిన హంతకులకు కొమ్ము కాయడమే విలువలా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో బూతులు తిట్టించడం మొదలు పెట్టిందే జగన్ అని, ఎదుటి వారు బూతులు తిడితే మాత్రం కోపం వచ్చిందా? అని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాలను బూతులమయం చేసిందే జగన్ అని యనమల విమర్శించారు.