ఏపీ రాష్ట్ర వాహనం కింద బుల్డోజర్ గా జగన్ ఫిక్స్ చేశాడు అనేంతగా ఏపీలో కూల్చివేతలు జరిగాయి. సోషల్ మీడియాలో జగన్ కి బుల్డోజర్లకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం అంటూ సెటైర్లు పేలాయి.
తాజాగా యూపీ ఎన్నికల నేపథ్యంలో యోగి వల్ల మళ్లీ బుల్డోజర్లు రాజకీయాల్లోకి ప్రవేశించాయి. ఇంతకీ ఏంటా బుల్డోజర్ల కథ తెలుసుకోవాలంటే ముందు ఎన్నికల ఫలితాలతో మొదలుపెట్టాలి.
యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యూపీ ఎన్నికల ఫలితాల్ని వెలువడ్డాయి. అంచనాలకు మించిన రీతిలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది బీజేపీ. యూపీ ఎన్నికల వేళ.. యోగి నోటి నుంచి బుల్ డోజర్ల మాట రావటం.. అది కాస్తా సంచలనంగా మారటం ఒక ఎత్తు అయితే.. దాన్ని తనదైన శైలిలో మార్చేసిన తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఎన్నికల వేళ.. సంచలన వ్యాఖ్య చేయటం తెలిసిందే.
యూపీలో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్ డోజర్లతో తొక్కిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సైతం సీరియస్ కావటం.. నోటీసు ఇవ్వటం తెలిసిందే. తాజాగా యూపీలో తమ పార్టీ ఘన విజయాన్ని సాధించిన వేళ.. రాజాసింగ్ తన నోటికి మరోసారి పని చెప్పారు. ఎన్నికల ప్రచారం వేళ ఆయన నోటి నుంచి వచ్చిన బుల్ డోజర్ల మాటకు కొనసాగింపుగా ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు.
యూపీ బుల్ డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఒక చానల్ తో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అవినీతి.. కుటుంబ పాలనను బుల్ డోజర్లతో తొక్కిస్తామన్నారు. డబ్బు సంపాదన కోసమే దేశ వ్యాప్తంగా మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పిన ఆయన.. బీజేపీకి వారు మిత్రపక్షం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. బీజేపీకి లబ్థి చేకూర్చటం కోసమే మజ్లిస్ ప్రయత్నిస్తుందని.. ఈ రెండు పార్టీల మద్య దోస్తానా ఉందంటూ సాగు ప్రచారం అంతా అబద్ధమేనని చెప్పారు.
ఎప్పటికి మజ్లిస్ పార్టీ తమకు రాజకీయ శత్రువుగానే ఉంటుందన్న రాజాసింగ్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అసత్యపు ప్రచారాన్ని నమ్మలేదన్నారు. మొన్నటికి మొన్న ఎన్నికల వేళలో యోగి ఆదిత్యనాథ్ అంటే యూపీ అని.. ఉత్తరప్రదేశ్ అంటే ఆదిత్యనాత్ అన్న ప్రచారం సాగుతోంది. అంచనాలకు తగ్గట్లే.. యోగి ఘన విజయాన్ని సొంతం చేసుకోవటంతో రాజాసింగ్ నోట మరోసారి బుల్ డోజర్ల మాట వచ్చిందని చెప్పక తప్పదు.