ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. చాలా కాలంగా కర్నాటక సీఎం బీఎస్ యడ్యూరప్పను తప్పించాలనే ఒత్తిడి విపరీతంగా వస్తోంది కేంద్ర నాయకత్వంపై. చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు యడ్డీకి వ్యతిరేకంగా మంటలు మండిస్తున్నారు. యడ్యూరప్ప విషయంలో ఢిల్లీ నుండి ప్రత్యేకంగా పార్టీ తరపున ఓ దూత వచ్చి అందరి అభిప్రాయాలు సేకరించిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే యడ్డీని జాతీయ నాయకత్వం హఠాత్తుగా ఢిల్లీకి పిలిపించుకున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సీఎం భేటీ అయ్యారు. వీళ్ళ భేటీలు ముగిసన తర్వాత బెంగళూరుకు వెళ్ళటానికి ఎయిర్ పోర్టుకు చేరుకున్న యడ్డీని అమిత్ షా మళ్ళీ వెనక్కు పిలిపించటం సంచలనంగా మారింది.
విమానాశ్రయం నుండి నేరుగా అమిత్ కార్యాలయానికి వెళ్ళిన యడ్డీ దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. దీంతోనే యడ్డీ రాజీనామా విషయం ఒక్కసారిగా గుప్పుమంది. ఈనెల 25వ తేదీకి సీఎంగా బాధ్యతలు తీసుకుని యడ్డీ రెండేళ్ళు పూర్తిచేస్తారు. ఆ మరుసటి రోజే తను రాజీనామా చేయబోతున్నట్లు బెంగుళూరు, ఢిల్లీ వర్గాల్లో ప్రచారం పెరిగిపోతోంది. 79 ఏళ్ళ యడ్డీ చురుకుగా రాజకీయాలు చేయలేకపోతున్నారు.
తన తర్వాత కొడుకు విజయేంద్రన్ రాజకీయ భవిష్యత్తుపై జాతీయ నాయకత్వం నుండి భరోసా రాగానే సీఎంగా రాజీనామాకు రెడీ అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. యడ్డీకి ప్రత్యామ్నాయంగా బీఎల్ సంతోష్, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బసవరాజ్ బొమ్మయ్, మురుగేష్ నిరానీ పేర్లు తెరపైకి వచ్చాయి. మరి వీరిలో అమిత్ షా సహకరం ఎవరికుంటుందో చూడాలి.
—–
ఇది చదవండి :