‘దగ్గరలో ఒక రోజుంది. గుండెలు బాదుకుని పొర్లాడి..పొర్లాడి ఏడ్చే రోజు తీసుకొస్తా. ఆ రోజు అనుకుంటావు.. ఎందుకు రా ఆయన గురించి మాట్లాడింది.. నోరుమూసుకుని ఉంటే బాగుండేది అనే పరిస్థితి తీసుకొస్తా. మీకు, మీ చుట్టుపక్కల ఉన్నవారికి హెచ్చరిక’ అని వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి 3 నెలల కిందట విడుదల చేసిన ఆడియో ఇది. అసభ్య పోస్టులు, మెసేజ్‌లతో తనను మానసికంగా వేధిస్తున్నారని టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనుష పోలీసులకు జూన్ 26వ తేదీన ఫిర్యాదు ఇచ్చారు. ఆ మరుసటి రోజే అంటే ఈ ఆడియో హెచ్చరిక విడుదలైంది.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి హెచ్చరికలను పోలీసులు ఉపేక్షించకూడదు. చట్టప్రకారం విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ సీఐడీ ఆ పనిచేయలేదు. రాష్ట్రంలో ఉన్న పోలీసు శాఖ కూడా ఆ పనిచేయలేదు. ఎందుకంటే ఆయన అధికార పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి. అంతకు మించిన అధికార పీఠంలో పెద్దల మనిషి. అందుకే పోలీసులు ఆయన్ను అలా వదిలేశారు. ఫలితం రాజకీయ ప్రత్యర్థులపై వికృతమైన మానసిక యుద్ధం. విచక్షణ మరచి ప్రత్యర్థి పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై.. అందునా మహిళలపై హ్యాకింగ్, మార్ఫింగ్, డీప్ పేకింగ్, పోస్టింగ్ విధానంతో విరుచుకుపడ్డారు.
డేటాతో పర్సనల్ ఎటాక్
వైసీపీ తన రాజకీయ ప్రత్యర్థుల ఆధ్వర్యంలోని సోషల్‌మీడియాలో క్రియాశీలంగా పనిచేస్తున్నవారిని గుర్తించి వారి ఫోన్ నెంబర్, ఐపీ అడ్రస్, కంప్యూటర్, దాని ఐపీ అడ్రస్‌లను సేకరించినట్లు తెలిసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్లు ఉన్న వారి డేటాను సేకరించి వాటిని ఆధునిక టెక్నాలజీతో హ్యాక్ చేసినట్లు సమాచారం. ఇందుకు పెగాసస్ వాడుతున్నారా? లేక మరేదైనా ఆధునిక టెక్నాలజీని వాడుకుంటున్నారో గానీ, వారి ఫోన్లలోని ఫోటోలు, వీడియోలు, ఇతర కీలకమైన ఫైళ్లు వారి చేతికి చిక్కినట్లు స్పష్టమవుతోంది.
దీంతోపాటుగా సోషల్ మీడియా కోసం ఉపయోగించే కంప్యూటర్ల ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్‌లను సేకరించి హ్యాకింగ్ చేసి ఉంటారన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఫోన్లకు మెసేజ్‌ల రూపంలో హెచ్టీపీఎల్ లింకులు పంపడం ద్వారా వాటిని హ్యాక్‌చేయడం సులువు. ఆసక్తికరమైన అంశాల లింకులు పంపిస్తే వాటిని ఓపెన్ చేస్తే ఆ ఫోన్ హ్యాక్ అయ్యేలా ముందస్తుగా సాంకేతిక ఏర్పాట్లు ఉంటాయి. ఐఫోన్లను మెసేజ్‌ల ద్వారా హ్యాక్‌చేయడం కొంత కష్టం. కానీ వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా డేటా తీసుకోవడం సులువు. ఈ పని కూడా చేసి ఉంటారని బాధితులు చెబుతున్నారు.
మార్పింగ్, మిక్సింగ్, మేకింగ్..
టార్గెట్ చేయాలనుకున్న వ్యక్తుల సెన్సిటివ్ ఫోటోలు, వీడియోలను ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు. అందులోనూ మహిళలను టార్గెట్ చేయడంతో వారు తమ వ్యక్తిగత సమాచారం బయటికొచ్చిందని తీవ్ర భయాందోళనలకు గురయ్యేలా వ్యూహం అమలు చేస్తున్నారు. ఇప్పుడీ దశను దాటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా టార్గెట్ చేసే వ్యక్తుల ఫొటోల్లో తల వరకు ఉంచి మిగతా భాగం మార్చేసి డీప్ ఫేకింగ్ పద్ధతిలో వారు అసభ్య, అభ్యంతకరమైన దుస్తులు ధరించినట్లుగా, లేదా నృత్యాలు చేస్తున్నట్లుగా ఫోటోలు, వీడియోలు తయారు చేస్తున్నారు. ఇంకా కంటెంట్ తీవ్రత పెంచేందుకు, అవి నిజమేనని భ్రమింపజేసేందుకు ఏఐ విధానంలో వీడియోలు కూడా సృష్టిస్తున్నారు.
శృంగార వీడియో ఉందని..
కడప జిల్లా పులివెందులకు చెందిన రవీందర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫేస్బుక్, ట్విటర్ అకౌంట్ ద్వారా వైసీపీ ప్రత్యర్థులు.. ప్రత్యేకించి ఐటీడీపీలో క్రియాశీలంగా ఉంటున్న వారు, టీడీపీ అభిమానులపై మానసిక దాడి జరుగుతోంది. ఇటీవల రాజధాని ప్రాంతానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్త శృంగార సన్నివేశాలు మా దగ్గర ఉన్నాయి. 1.32 సెకన్ల వీడియో ఉంది, ఇదిగో సాక్ష్యం అంటూ ఓ మార్ఫింగ్ ఫోటోను ట్విటర్, ఫేస్బుక్లో పోస్టుచేశారు. భర్తతో కాకుండా మరొకరితో శృంగారంలో ఉన్న వీడియో ఉంది. అది కావాలనుకున్నవారు తమకు వివరాలివ్వాలని పోస్టు పెట్టారు.
సహజంగానే ఇది ఆ మహిళను, ఆమె కుటుంబీకులను, టీడీపీని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అది మోసం అని నిర్ధారించేలోపే ఆమె వ్యక్తిగత జీవితాన్ని రోడ్డునపడేసే ప్రయత్నం చేశారు. నిజంగా ఇది నిర్భయ చట్టం పరిధిలోకి వస్తుంది. ఓ మహిళ శృంగార వీడియోలున్నాయని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా ఇప్పటి వరకు సీఐడీ గానీ, మహిళా కమిషన్ గానీ స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం (లేని) దిశ చట్టం అమల్లో ఉందని జగన్ పదే పదే గొప్పగా చెబుతుంటారు. కానీ ఓ మహిళ వ్యక్తిగత జీవితం గురించి వైసీపీ నేత బహిరంగంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకోనంతగా వ్యవస్థలు చేతులు కట్టుకోవడం శోచనీయమని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన ఓ తెలుగు మహిళ ఫోన్లో ఉన్న కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేసి నేరుగా వాట్సాప్ చేశారు. ఆ తర్వాత వాటినే ఫేస్బుక్లో పోస్టు చేశారని తెలిసింది. ఆ ఫోటోలను ఆమె భర్త, ఇతరులకు తెలిసేలా దిగజారుడు, అనైతికదాడికి దిగారు. రాజధాని ప్రాంతానికే చెందిన మరో మహిళా టీడీపీ నేతను టార్గెట్ చేశారు. ఆమె తండ్రి గతంలో పెద్ద కార్మిక నాయకుడు. మచ్చలేని కుటుంబం వారిది. టీడీపీ సోషల్ మీడియాలో ఆమె క్రియాశీలంగా ఉన్నారని, ఆమెను మానసికంగా దెబ్బకొట్టేందుకు వైసీపీ కిరాయి మూకలు బరితెగించా యి. ఆమె ఫోన్లో ఉన్న ఫోటోలు, వీడియోలనే ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో ఒక్కటొక్కటిగా పోస్టుచేస్తున్నారు.
ఇంటి టెర్రస్ (మిద్దపై) ఆమె ఓ సందర్భంలో నృతం చేస్తున్న 28 సెకన్ల వీడియోను సోషల్‌మీడియాలో పోస్టుచేశారు. అప్పుడప్పుడు తాగి డ్యాన్సులు చేస్తుండాలి.. రాత్రిళ్లు తాగేసి సమాజాన్ని చెడగొడుతున్నారు. ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పైగా ఇంకా ఇంకా వస్తాయి.. కొత్తవి వస్తాయంటూ నేరుగా ఫోన్‌కు మెసేజ్చేసి బెదిరించినట్లు తెలిసింది. స్వాతిరెడ్డి అనే టీడీపీ అభిమానిపై పోర్న్‌స్టార్ అనే ముద్రవేసి మార్ఫింగ్ ఫొటోలు వదిలారు. టీడీపీ యువనేత లోకేశ్ సతీమణి బ్రాహ్మణి పేరిట ఇటీవల ఓ ఫేక్ ట్విటర్ పోస్టును విడుదల చేశారు. ముఖ్యమంత్రి సతీమణి తనకు అక్కలాంటిదని, ఆమె ఫొటోలను మార్ఫింగ్చేసి దిగజారుడు పోస్టులు పెట్టే వ్యక్తులకు టీడీపీ పెద్దలు మద్దతివ్వడం బాధేసిందని, ఆమెను కించ పరిస్తే తనను కించపరిచినట్లేనని ఆమె ట్విటర్లో తన అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లుగా పోస్టు పెట్టారు.
డర్టీ పాలిటిక్స్‌కు టీడీపీ స్వస్తిపలుకుతుందని ఆశిస్తునా అని ఆమె పేర్కొన్నట్లుగా రాసుకొచ్చారు. బ్రాహ్మణి వైసీపీ సోషల్ మీడియాకు కితాబు ఇప్పించుకున్నట్లుగా రాసుకున్నారు. ఇందులో నిజమెంత? ఒక వేళ సీఎం సతీమణిని ఎవరైనా అవమానిస్తే సాటి మహిళగా బ్రాహ్మణి ఖండింవచ్చు. ఆ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటన రూపంలో ఇవ్వొచ్చు. కానీ ఆమె నుంచి అలాంటి ప్రకటన రాలేదు. అయినా ఆమె ట్విటర్ పోస్టులో సంచలన ప్రకటన చేశారని వైసీపీ సోషల్‌మీడియా ఫేక్ ట్వీట్‌ను సృష్టించడం దేనికి సంకేతం? అంటే వివాదంలో బ్రాహ్మణిని కూడా లాగాలనే ఉద్దేశం ఉందని స్పష్టమవుతోంది.