పాదయాత్రపై వైసీపీ కుట్రలు పన్నుతున్న సంగతి తెలిసిందే…ఆ పాదాలు.. రాజధాని కోసం.. అలుపెరగని అడుగులు వేస్తున్నాయి. రాష్ట్రానికి ఏకైక రాజధాని కావాలనే ఆకాంక్షతో రాజధాని రైతులు ఎండనక వాననక.. కాలిబాట పట్టి.. ప్రజలకు తమ కడుపుకోతను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. రాబందు రెక్కల చప్పుడులా.. వైసీపీ నాయకులు.. రాజధాని రైతులపై తీవ్ర విమర్శలు.. చేస్తున్నారు. అయినా.. రైతులు.. రాష్ట్రం కోసం.. అన్నీ భరిస్తున్నారు. అయినా.. వైసీపీకి కసి తీరడం లేదు. ఆ నాయకుల కళ్లు చల్లబడడం లేదు. న్యాయపోరాటంలో రైతులు విజయం దక్కించుకున్నా.. వారిని వంచిస్తూనే ఉంది.
తాజాగా అమరావతి మహా పాదయాత్ర 2.0 విశాఖకు చేరువవుతున్న నేపథ్యంలో అధికార పక్షం కొత్త ఎత్తుగడకు తెరతీసింది. రైతులపై ఇప్పటికే చేస్తున్న దాడిని తీవ్రతరం చేయాలని ఆలోచనలు చేస్తోంది. ఇందుకోసం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించాలనే ప్రణాళికలు వేస్తోంది. మరోవైపు అన్నదాతలకు పోటీగా….పాదయాత్ర చేసేందుకు మంత్రులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రపై ఎదురుదాడిని పెంచేందుకు అధికార వైసీపీ రాజీనామా ఎత్తుగడ లకు తెరతీసింది. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవి నుంచి వైదొగలడానికి సిద్ధంగా ఉన్నానంటూ విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. “విశాఖ రాజధాని సాధన ఉద్యమంలో మరింత చురుకుగా పాల్గొనడానికి మంత్రి పదవి నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నా. వికేంద్రీకరణ సూత్రంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ ఆలోచనలకు మద్దతునిస్తూ, మీ చేతుల్ని మరింత శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉంది” అంటూ.. ధర్మాన సీఎంతో చెప్పినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం లీకులిచ్చింది.
అమరావతి నుంచి అరసవల్లికి పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి దాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయమై వైసీపీలో ముఖ్యనేతలు, ముఖ్యమంత్రి జగన్ వద్ద నిర్వహించిన సమావేశాల్లో కీలకంగా వ్యవహరించిన ధర్మాన, ఇప్పుడు రాజీనామాకు సిద్ధం అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం ధర్మాన లాంటి సీనియర్ మంత్రి.. పదవికి రాజీనామా చేస్తున్నారంటే అది చర్చనీయాంశంగా మారుతుందనే అంచనాతో, అధికార పక్షం ఈ వ్యూహానికి తెరతీసిందా అన్న ప్రచారం జరుగుతోంది.