వైసీపీ ప్రభుత్వంపై కొన్నాళ్లుగా విమర్శలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయ ణ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటున్నారని, అవే వస్తే తామంతా ముందే ఇంటికి వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. తాజాగా సైదాపురం మండలంలో పర్యటించిన ఆయన గ్రామ, వార్డు సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడం లేదని మండిపడ్డారు.
‘‘ప్రజలు మాకు(వైసీపీ) అధికారం ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఇంకా సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇందుకు సాంకేతిక కారణాలా? బిల్లుల చెల్లింపు జాప్యమా? తెలియడం లేదు’’ అని ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్లయినా.. అభివృద్ధి చేయలేదని.. ఏమొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతామని.. ఆయన అన్నారు. అంతేకాదు.. పట్టుమని ఒక్క ప్రాజెక్టు కూడా తన నియోజకవర్గంలో పూర్తి చేయలేకపోయామని చెప్పారు.
దీనికి ముందు ఏడాది కిందట కూడా అధికారులతో భేటీ అయిన నేపథ్యంలో తన నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని.. తాను ఎమ్మెల్యేనోకాదో.. తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. గడపగడపకు కార్యక్రమానికి సంబంధించి కూడా ఆనం వ్యాఖ్యలు చేశారు. తాను ఎలా వెళ్తానని.. ప్రశ్నించారు. పనులు చేయించానని వెళ్లనా.. హామీలు నెరవేర్చానని ప్రజల మధ్యకు వెళ్లనా..? కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించానని వెళ్లనా? అని ప్రశ్నించారు. దీంతో అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇదిలావుంటే గత కొన్నాళ్లుగా ప్రభుత్వంపై వరుస ఆరోపణలు చేస్తున్న ఆనంపై పార్టీ అధినేత, సీఎం జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో నేదురుమల్లికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆనం మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నారు.