విశాఖపట్నం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జనసేన నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగింది. వరుసగా ఈ ఇద్దరూ పోటా పోటీ ప్రెస్మీట్లు పెట్టి.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిం చుకున్నారు. “ఎంవీవీ ఓడించి.. ఇంటికి పంపిస్తా“ అని వంశీ కృష్ణ వ్యాఖ్యానించగా.. “నువ్వు నన్నేమీ పీకలేవ్“అని ఎంవీవీ కౌంటర్ ఇచ్చారు. దీనికి ప్రతిగా గంట వ్యవధిలోనే మళ్లీ ప్రెస్ మీట్ పెట్టిన వంశీ కృష్ణ.. “నేను నిన్ను పీకి తీరుతా!“ అని రియాక్ట్ అయ్యారు. దీంతో “ఇదేం పీకుడు రాజకీయం బ్రో!“ అని విశాఖ వాసులు తలలు పట్టుకున్నారు.
ముందు వంశీతో మొదలు..
వైసీపీ నాయకులు ఎవరి మీద వ్యక్తి గత విమర్శలు చేయనని పవన్‌కు చెప్పానని, అదే మాట మీద ఉన్నానని వంశీ వ్యాఖ్యానించారు. అయితే, ఎంవీవీ మాత్రం విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. బంధువుల దగ్గర ఎంపి తనను చులకన చేసి మాట్లాడాడని, అది మర్చిపోనన్నారు. ఆయన చెమ్చాలు.. కుమార్, జీవిల గురించి మాట్లాడితే కార్పొరేటర్లతో, మేయర్ తో తిట్టిస్తున్నారని అన్నారు. ఎంవీవీ విశాఖ వచ్చే నాటికి తాను కోటీశ్వరుడని అని, నీ జీవితానికినా జీవితానికి పోలిక ఏంటి..? అని ప్రశ్నించారు. 2700 ఓట్లు మెజారిటీతో కార్పొరేటర్ గా గెలిచానని, మీరంతా తనకు వ్యతిరేకంగా పనిచేసిన బంపర్ మెజారిటీతో గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎంవీవీ పదవిని పీకేస్తామని చెప్పారు.
ఎంవీవీ కౌంటర్..
వంశీ కృష్ణ విమర్శలపై స్పందించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వంశీ తన చేతి వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటుగా ఎంపీ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దమ్ముంటే తనపై చేసిన భూ కబ్జాల ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపైనా ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా, లేకపోయినా తాను వ్యాపారాలు చేశానని, నిజాయితీతోనే వ్యాపారాలు సాగిస్తున్నానని ఎంవీవీ స్పష్టం చేశారు. తనను ఓడిస్తానంటూ వంశీ శపథాలు చేస్తున్నాడని, తనకు ఓట్లేయని జనాలను నాకు ఓట్లేయొద్దంటే మానేస్తారా..? అని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా గెలవని వంశీ వద్దంటే తనకు ప్రజలు ఓట్లేయకుండా ఉండరని ఎంవీవీ స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి పుణ్యంతో కార్పొరేటర్‌గా గెలిచాడని, పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు పెద్ద నాయకుడిలా ప్రగల్భాలు పలికాడని, 27 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు వస్తున్నారంటూ గొప్పలు చెప్పాడని, ఒక్క కార్యకర్తను కూడా తనతో తీసుకెళ్లలేదన్నారు. టికెట్ ఇస్తారో, ఇవ్వరో తెలియని వ్యక్తి, ఇస్తే గెలుస్తాడో, లేదో నమ్మకం లేని వ్యక్తి మంత్రి అవుతానంటూ భ్రమల్లో బతికేస్తున్నాడని అన్నారు.
ప్రతి కౌంటర్..
ఆవెంటనే వంశీ మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. “ఎంవీవీ చేతి వెంట్రుక పీకలేనని ఆయన చెప్పుకొన్నాడు. కానీ, ఆయన బట్టలు ఊడబీకి పంపించేందుకు విశాఖ తూర్పు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది పక్కా. నేను పీకడం ఖాయం“ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా వైసీపీ నుంచి కొన్ని రోజుల కిందటే బయటకు వచ్చిన వంశీ ఈ రేంజ్లో వ్యాఖ్యలు సంధిస్తుండడం గమనార్హం.