ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పుడూ ప్రత్యర్థులను తమ ట్రాప్‌లో పడేయడానికే చూస్తుంటుంది. ఆ పార్టీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్‌లో సిద్ధహస్తులు అనే పేరుంది. పాలన విషయంలో ఏదైనా వైఫల్యం మీద చర్చ జరుగుతుంటే.. ఇంకేదో వివాదాన్ని రాజేసి చర్చను అటు వైపు మళ్లించడం అలవాటుగా మారిపోయింది. ప్రతిపక్షాలు వైసీపీ ట్రాప్‌లో చిక్కుకుని ఇబ్బంది పడటం కూడా పలు సందర్భాల్లో చూశాం.
ఐతే ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీ, జనసేన దూకుడు మీద ఉంటే.. వైసీపీ అత్మరక్షణలో పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ వాళ్లంతా చాలా లైట్ అన్నట్లే మాట్లాడతారు కానీ.. వారాహి యాత్ర మొదలైన దగ్గర్నుంచి జనసేనానికి ఆ పార్టీ నేతలు ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పవన్ కూడా ఈ యాత్రలో పవర్ ఫుల్ కామెంట్లతో ఏపీ రాజకీయం మొత్తం తన చుట్టూ తిరిగేలా చేసుకున్నారు.
పవన్‌కు ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నడూ దొరకనంతగా ఇప్పుడు మీడియా కవరేజీ దక్కుతోంది. పవన్‌కు ఏ రకంగానూ కవరేజీ ఇవ్వడానికి ఇష్టపడని సాక్షి, ఇతర వైసీపీ అనుకూల మీడియా కూడా రోజంతా ఆయనకు కవరేజీ ఇస్తున్నాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా పవన్ మీదే ఫోకస్ చేసే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులతో ప్రజల గురించిన డేటాను పంచుకోవడం వల్ల మహిళల అక్రమ రవాణా పెరిగిపోయిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపాయి.
వైసీపీ నేతలు ఈ వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందిస్తున్నారు. అలాగే వాలంటీర్లతో పాటు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ వ్యాఖ్యల వల్ల పవన్‌కు జరిగిన డ్యామేజ్ కొత్తగా ఏమీ లేదు. వాలంటీర్లు అంటే వైసీపీ వాళ్లే కాబట్టి వాళ్లలో కొత్తగా వ్యతిరేకత వచ్చేదేమీ లేదు. జనం ఏమీ ఈ వ్యాఖ్యలతో పవన్ మీద వ్యతిరేకత పెంచుకునేదేమీ లేదు.
కానీ, ఈ వ్యాఖ్యలతో వైసీపీలో వేడి పుట్టించి.. మీడియా తనకు ఫుల్ కవరేజీ ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించి ఏపీ రాజకీయం తన చుట్టూ తిరిగేలా చేసుకున్నాడు పవన్. నెగెటివ్ స్టోరీనే అయినప్పటికీ సాక్షి పత్రిక పవన్ మీద సోమవారం బేనర్ స్టోరీ వేయడం ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనం. మొత్తంగా చూస్తే పవన్ ట్రాప్‌లో వైసీపీ పడ్డట్లే కనిపిస్తోంది.