తాజాగా ముగిసిన నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ కీలక నేతలు చతికిల పడ్డారు. పార్టీ అధినేత, సీఎం జగన్ వారిపై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. ఫైర్ బ్రాండ్లుగా.. పార్టీలో తోపులుగా ఇప్పటి వరకు చలా మణి అయిన నాయకులు.. పంచాయతీ లను ఏకగ్రీవం చేసుకుంటారని అందరూ భావించారు. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ ఆయా నేతలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గుండుగుత్తుగా ఏకగ్రీవాలు చేస్తారని.. పార్టీని పరుగులు పెట్టిస్తారని.. గ్రామస్థాయిలో విజృంభిస్తారని అనుకున్నారు. కానీ, నాలుగు విడతలు ముగిసే సరికి మాత్రం చాలా మంది వైసీపీ ఉద్ధండులు ఫెయిలయ్యారు.
కొడాలి నాని: జగన్ కేబినెట్లో కీలక మంత్రి. పైగా జగన్‌కు వీరవిధేయుడు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీని ఎప్పుడు టార్గెట్ చేయాలన్నా.. నానిని జగన్ రంగంలోకి దింపుతున్నారు. అలాంటి నాని.. తాజా పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపించలేకపోయారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ సైకిల్ పరుగులు పెట్టింది. అదేసమయంలో మంత్రిగారి సొంత ఇలాకాలోనూ వైసీపీ విజయం సాధించలేక పోయింది. ఇది పార్టీకి మైనస్‌గా మారింది.
చెవిరెడ్డి భాస్కరరెడ్డి: జగన్‌కు ఉన్న అత్యంత వీర విధేయుల్లో ఈయన ముఖ్యులు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన నాయకుడు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించి.. పార్టీలో తోపుగా మారారు. అయితే.. తాజాగా జరిగిన నాలుగు దశల పంచాయతీ ఎన్నికల్లో ఆయన సత్తా చాటలేక పోయారు. ముఖ్యంగా చంద్రబాబు పుట్టి పెరిగిన గ్రామం నారావారిపల్లెలో వైసీపీ జెండా ఎగురవేస్తానని చెప్పి శపథం చేసిన ఈయన పూర్తిగా చతికిల పడ్డారు. ఇక్కడ టీడీపీ మద్దతు అభ్యర్థి లక్ష్మి గెలుపు గుర్రం ఎక్కారు.
నందిగం సురేష్: బాపట్ల ఎంపీ అయిన సురేష్.. జగన్ అంటే ప్రాణం ఇస్తారు. ఈ క్రమంలోనే రాజధానిపై పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. ఈయన కూడా స్థానకంలో పూర్తిగా విఫలమయ్యారు. బాపట్ల పరిధిలోని పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది.
కోన రఘుపతి: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్.. కోన రఘుపతి.. ప్రాతినిథ్యం వహిస్తున్న బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో.. రెండు గ్రామ పంచాయతీలను వైసీపీకి ఏకగ్రీవం చేయాలని అనుకున్నారు. అయితే.. టీడీపీ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కింది. ఇది కూడా రఘుపతిపై జగన్ పెట్టుకున్న ఆశలను కల్ల చేసింది.
గడికోట శ్రీకాంత్‌రెడ్డి: అత్యంత కీలకమైన జగన్ సొంత జిల్లా కడపలో వ్యవహారాలు చక్కబెడుతున్న ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్‌రెడ్డి. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కడపలో టీడీపీ పాగా వేసిందంటే..ఈయన ఎలా ఫెయిలయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ఫలితంగా జగన్ దగ్గర మైనస్ మార్కులు పడ్డాయని అంటున్నారు.
తానేటి వనిత: మంత్రి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ స్థానికాన్ని ఎగరేసుకుపోయింది. ఇక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీస్థానాలు కైవసం చేసుకుంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఈమెకు జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. తాజా ఫలితాల్లో ఆమె సత్తా చాటలేక పోవడం గమనార్హం.
సీదిరి అప్పలరాజు: శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి తొలిసారి ఎన్నికై.. ఇటీవల మంత్రి పగ్గాలు చేపట్టిన సీదిరి అప్పలరాజు జగన్ అంటే ప్రాణం పెట్టేస్తారు. దీంతో స్థానికంలో పట్టు సంపాయించి జగన్‌కు కానుకగా ఇస్తానని ఎన్నికలసమయంలో ప్రతిన చేశారు. కానీ.. ఫలితం అంతా రివర్స్ అయింది. ఇలా.. వైసీపీలో జగన్ కీలక సైన్యంగా భావించే నాయకులు ఈ నాలుగు దశల పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపలేక పోవడం పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారడం గమనార్హం.