విపక్షంలో ఉన్న వైసీపీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు మాజీ మంత్రి పేర్ని నాని అధికారిక ప్రకటన చేశారు. ఉమ్మడి కృష్ణా- గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం హయాంలో గ్రాడ్యుయేట్ ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునే అవకాశం లేదని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేనందున నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకాన్ని తాము కోల్పోయామని పేర్ని నాని అన్నారు.
టీడీపీకి అనుకూలంగా ఎన్నికలు జరుపుకోవాలని ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. పోటీ చేసే అభ్యర్థి స్వేచ్ఛగా ఓటు అడిగే అవకాశం లేదని ఆయన అన్నారు. అయితే వైసీపీ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గెలుపు, ఓటమి గురించి పక్కన పెడితే.. పోటీ చేశామా లేదా అనేది రాజకీయాల్లో చాలా ముఖ్యం. అప్పుడే బలాలు, బలహీనతలు తెలుస్తాయి.
ఓడినా సరే బలం ఏంటో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇప్పుడు వైసీపీకి వచ్చింది. కానీ ఫ్యాన్ పార్టీ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకుంది. పైగా ప్రభుత్వ తీరు వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆ పార్టీ నేతలు బిల్డప్ ఇస్తున్నారు. దీంతో యాంటీ ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ వైసీపీని ట్రోల్ చేయడం షురూ చేశారు. ఓటమి భయంతోనే ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో కూటమి బలంగా ఉండటంతో వైసీపీ ఎన్నికల బరిలోకి దిగేందుకు వణుకుతోందని అంటున్నారు.