వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయబోతున్నారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారం కాంగ్రెెస్ అధిష్టానంతో షర్మిల చర్చలు జరుపుతున్నారని, ఆమె తెలంగాణ నుంచి పోటీ చేయాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని టాక్ వస్తోంది. అయితే, షర్మిల ఏపీ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగితే బాగుంటుందని ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ స్పందించారు.
ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల వస్తే ప్రభావం ఎక్కువ ఉంటుందని రఘురామ అభిప్రాయపడ్డారు. వివిధ సర్వే ఏజెన్సీల నివేదికల ప్రకారం తాను ఈ మాట మాట్లాడుతున్నానని అన్నారు. ఆ సర్వేల ప్రకారం వైసీపీకి కష్టాలు తప్పవనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి 4 లేదా 5 స్థానాలు వచ్చే అవకాశం కూడా లేదని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మదిలో ఏముందన్న విషయంపై తనదైన శైలిలో ఆయన విశ్లేషణ చేశారు.
2009లో ఏపీలో కాంగ్రెస్ విజయం సాధించిందని, ఆ తర్వాత ఆ పార్టీ వైసీపీగా రూపాంతరం చెందిందని అన్నారు. కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లంతా 2014లో, 2019లో వైసీపీకి ఓటు వేశారని చెప్పారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, 6 శాతం ఓట్లు వైసీపీకి నష్టం చేయనుబోతున్నాయని వెల్లడించారు. వైఎస్ ను చూసి ముస్లింలు వైసీపీకి ఓటు వేశారని, ఇకముందు కాంగ్రెస్ కు వేస్తారని అన్నారు. వైసీపీకి సాలిడ్ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలలో మార్పు కనిపిస్తోందన్నారు.
ఇదంతా ఏపీలో కాంగ్రెస్ కు సానుకూలమని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 40 సీట్లు రావడం గగనమని అభిప్రాయపడ్డారు. సజ్జల కూడా ఎన్నికల గురించి మాట్లాడటం లేదని, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తులపై అధికారిక ప్రకటన వెలువడేందుకు కాస్త సమయం పట్టవచ్చని అన్నారు.