ఒకప్పటి అరుంధతి సినిమాలో వదల బొమ్మాళీ.. టైపులో వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామ కృష్ణరాజు.. ఏపీ సీఎం జగన్‌ను ఎక్కడా వదిలి పెట్టడం లేదు. పిటిషన్లపై పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఇటీవలే ఆయన వేసిన పిటిషన్ సంచలనంగా మారింది. సీఎం జగన్‌పై నమోదైన 11 కేసుల విచారణ మందకొడిగా ఉందని.. తెలంగాణ హైకోర్టులో వీటి విచారణ ముందుకు సాగడం లేదని.. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన అభ్యర్థిస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇది ప్రస్తుతం విచారణలో ఉంది. జగన్‌కు కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.
ఇక, దీంతో పాటే.. ఏపీలో ఓటర్ల అక్రమాలపై నిమ్మగడ్డ రమేశ్ బాబు(మాజీ ఎన్నికల ప్రధానాధికారి) వేసిన పిటిషన్లోనూ రఘురామ ఇంప్లీడ్ అయ్యారు. తాను కూడా తన వాదన వినిపిస్తానని.. తన నియోజకవర్గంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక, టీడీపీ నాయకులు కొందరు హైకోర్టులో రాష్ట్ర సీఐడీ, ఏసీబీ విభాగం చేస్తున్న దాడులను నిలువరించాలని.. ఇప్పటి వరకు నమోదైన కేసులను ఎత్తేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిలోనూ రఘురామ ఇంప్లీడ్ అయ్యారు. తను కూడా సీఐడీ బాధితుడినేని.. తనను కూడా తీవ్రంగా హింసించారని.. తన బాధ కూడా వినాలని పిటిషన్లో కోరారు.
ఇక, ఇప్పటికే ఏపీలో మద్యంకుంభకోణం, చీప్ లిక్కర్‌పై ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి. అయితే.. తాజాగా మరో పిటిషన్‌ను రఘురామ దాఖలు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. ఇది వేరే ధర్మాసనం ముందు త్వరలో విచారణకు రానుందని వెల్లడించారు. వలంటీర్లను అడ్డుపెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారని ఎంపీ రఘురామ విమర్శించారు. మొత్తానికి ఎన్నికల ముందు.. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా రఘురామ పిటిషన్ల యుద్ధమే చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి వీటిలో ఆయన ఏమేరకు విజయం దక్కించుకుంటారో చూడాలి.