వైసీపీపై, సీఎం జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే టీడీపీలో చేరేందుకు ఆనం సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరంలో యువగళం బహిరంగ సభలో ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాశీస్సులతో 1600 కిలోమీటర్ల పాదయాత్రను లోకేష్ పూర్తి చేసుకున్నారని ఆయన అన్నారు. వైసీపీ హయాంలో ఆత్మకూరులో తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శలు గుప్పించారు. స్థానికులకు ఇసుక దొరకకుండా ఇతర రాష్ట్రాలకు వైసీపీ నేతలు తరలిస్తున్నారని ఆరోపించారు. సోమశిల ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీ గెలిచిన మూడు నెలల్లోనే ప్రభుత్వం మాఫియా రాజ్యంగా మారిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
రైల్వే లైన్, ప్రభుత్వాసుపత్రి అన్నీ వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. యువతకు భవిష్యత్తునిచ్చేది లోకేష్ అని, టీడీపీతోనే ఆత్మకూరు అభివృద్ధి సాధ్యమని అన్నారు. వైసీపీది విధ్వంసకర ప్రభుత్వమని, సైకో ప్రభుత్వం అని విమర్శించారు. ప్రభుత్వ భవనాన్ని కూల్చేసిన ప్రభుత్వం తన పతనాన్ని తానే కోరుతుందని ప్రజావేదిక కూల్చివేతను ఆనం ప్రస్తావించారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అని ఆనం తీవ్ర భావోద్వేగానికి గురై ప్రసంగించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మకూరుకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని లోకేష్ సమక్షంలో విజ్ఞప్తి చేశారు.