వైసీపీలో ఒంగోలు ముసలం ముదిరి మరింత పాకాన పడినట్లు కనిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మరో సారి ఎంపీ టికెట్ ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని పట్టుబడుతున్నప్పటికీ..సీఎం జగన్ మాత్రం పట్టువీడడం లేదు. మాగుంటకు సీటు ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేయనని జగన్ కు బాలినేని తెగేసి చెప్పినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే వైసీపీకి మాగుంట గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఢిల్లీ పర్యటించిన జగన్…మాగుంటను కనీసం పలకరించకపోవడం చర్చకు దారి తీసింది.
దీంతో, రేపోమాపో మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో మాగుంట ఈ రోజు భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఒంగోలు లోక్ సభ టికెట్ పై హామీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఆ తర్వాత మాగుంట టీడీపీలో చేరే విషయాన్ని ఒంగోలులో అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
అయితే, తన కుమారుడు రాఘవ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని గతంలో శ్రీనివాసులరెడ్డి చెప్పారు. ఒంగోలు లోక్సభ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో రాఘవ రెడ్డి కూడా పర్యటిస్తున్నారు. ఒకవేళ రాఘవరెడ్డికి ఎంపీ టికెట్ వస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయ భవితవ్యం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు.. 1998, 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి.. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడారు. మాగుంటకు 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున ఎమ్మెల్సీగా పదవి దక్కింది. శ్రీనువాసులు రెడ్డి 2019 మార్చి 16న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.