వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో కక్ష సాధిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ అనుకున్నట్లుగానే రఘురామను ఆయన సొంత పార్లమెంటు నియోజకవర్గానికి రానివ్వకుండా చేయడంలో జగన్ సఫలమయ్యారనే చెప్పాలి. అయితే, తన అనుచరులకు ఇబ్బంది కలగకూడదనే ఒకేఒక్క కారణంతో రఘురామ వెనుదిరిగారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఆర్ఆర్ఆర్ విరుచుకుపడ్డారు.
ఏపీలో తాను ఇప్పట్లో అడుగుపెట్టలేనేమోనని, ఎన్నికల నియామావళి అమల్లోకి వచ్చి జగన్ చేతుల్లో పోలీసులు లేనప్పుడు మాత్రమే తాను ఏపీలో అడుగుపెట్టగలనని షాకింగ్ కామెంట్లు చేశారు. తనను అభిమానించే వారిన పోలీసులు చిత్రహింసలకు గురిచేయడాన్ని తట్టుకోలేకపోయానని, వారి క్షేమాన్ని కాంక్షించే తాను అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వెళ్లలేదని చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు కారులో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లారని వారి తండ్రి తనకు ఫోన్ చేసి చెప్పారని, అది విని తనకు బాధ కలిగిందని అన్నారు.
తన కారణంగా చిత్రహింసలకు గురైనవారు తనను క్షమించాలని చెప్పిన రఘురామ మరోసారి తన హుందాతనాన్ని చాటుకున్నారు. ఎంపీలు అంటే చట్టాలు చేసేవారని ప్రజలు అనుకుంటారని, కానీ చట్టాలు చేసే ఒక ఎంపీ కూడా సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొనకపోతే ప్రధాని తప్పుగా అనుకుంటారేమోనని భావించానని, కానీ పీఎంవో నుంచి వచ్చిన ఆహ్వానితుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆందోళన లేదని రఘురామ అన్నారు. పార్లమెంటరీ లా జస్టిస్, పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ సభ్యుడినైన తనకు జరిగిన అన్యాయం దేశంలో ఇంకెవరికీ జరగలేదని అన్నారు.