వైసీపీ నేత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, తనయుడు, ఆడిటర్ ల కిడ్నాప్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంబానికి రాష్ట్రంలో రక్షణ లేదని, మిగతా ప్రజల సంగతి దేవుడికి తెలియాలని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖలో వ్యాపారం చేయలేనని, అందుకే హైదరాబాద్ కు తన వ్యాపారాలను తరలిస్తున్నారని సన్నిహితుల దగ్గర ఎంవీవీ వాపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ ఎంపీనే విశాఖను వదిలి వెళ్ళిపోతున్నారని, అటువంటి విశాఖను జగన్ రాజధాని చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై ఎంవీవీ స్పందించారు. తన కుటుంబ సభ్యులు కిడ్నాప్ కు గురైననట్లుగా పోలీసులు చెప్పే వరకు తనకు తెలియదని అన్నారు. తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తన కుటుంబ సభ్యులను హింసించారని ఆయన అన్నారు. మూడు రోజులపాటు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారని, హేమంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. హేమంత్ కు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ఇక, విశాఖలో రక్షణ లేదని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలను ఎంవీవీ ఖండించారు. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల లోపే ఆ కేసును పోలీసులు ఛేదించారని గుర్తు చేశారు. ఇటువంటి చిన్న చిన్న ఘటనలు జరగడం ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా సహజమేనని సమర్థించుకున్నారు. అయితే, ఎంవీవీ చేసిన తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. తన భార్య, కుమారుడు కిడ్నాప్ అయితే పోలీసులు చెప్పే వరకు కిడ్నాప్ అయిన విషయం తనకు తెలియదని ఎంపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రోజుకు ఒకసారి అయినా కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడతారని, అటువంటిది కిడ్నాప్ అయ్యి 72 గంటలు గడిచిన తర్వాత ఎంపీకి తెలిసిందంటే అర్థం ఏమిటని విమర్శలు గుప్పిస్తున్నారు.