వైసీపీ కీలక నాయకుడు, ఆ పార్టీ బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి .. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఆయన .. సీఎం జగన్పై సూటి పోటి మాటలతో విమర్శలు గుప్పించారు. బీసీలకు ఏదో న్యాయం చేశామని.. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని ..చెబుతున్న జగన్ మాటల్లోనే సామాజిక న్యాయం ఉందన్నారు. వైసీపీలో సామాజిక న్యాయం కేవలం నేతిబీరలో నెయ్యి చందమేనని విమర్శించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణ మూర్తి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన గురజాల(గుంటూరు) నియోజకవర్గం టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే.. చివరి నిముషంలో కాసు మహేష్ రెడ్డి తెరమీదకి రావడంతో దానిని వదులుకున్నారు. ఈ దఫా అయినా.. తనకు న్యాయం చేయాలని ఆయన ఆశించారు. కానీ, పార్టీ ఆయన మొర వినడం లేదు. పోనీ.. టీటీడీ చైర్మన్ పోస్టు అయినా.. ఇవ్వాలన్న జంగా విజ్ఞప్తిని వైసీపీ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే జంగా.. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
“బీసీలకు పదవులు ఇచ్చారు కానీ, అధికారాలు ఏవి? కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి. బీసీలకు నామమాత్రం కూడా అధికారాలు లేవు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, వైసీపీలో సామాజిక న్యాయం కూడా అంతే. బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడంలేదు. గౌరవం ఇవ్వడంలేదు. ప్రోటోకాల్ పాటించడంలేదు. బీసీలు ఇవాళ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీలు ఇవాళ పార్టీకి దూరమవుతున్నారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది“ అని జంగా కృష్ణమూర్తి ఈ వీడియోలో పేర్కొన్నారు.
జగన్ రెడ్డి బీసీలను అణగదొక్కుతున్నాడు. జగన్ రెడ్డి చెప్పే సామాజిక న్యాయం, నేతి బీరకాయలో నెయ్యి లాంటిది. – వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్ #BCDrohiJagan #WhyAPHatesJagan #AndhraPradesh pic.twitter.com/yVf32IbRjL
— Telugu Desam Party (@JaiTDP) February 12, 2024