తిరుమల శ్రీవారి దర్శన టికెట్లతో వైసీపీ మహిళా ఎమ్మెల్సీ జకియాఖానం వ్యాపారం చేసిన బాగోతం తాజాగా బయటపడింది. బెంగళూరుకు చెందిన సాయి కుమార్ అనే వ్యక్తికి తిరుపతి దేవస్థానం వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను వైసీపీ ఎమ్మెల్సీ బ్లాక్ లో భారీ ధరకు విక్రయించారు. సదరు ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై 6 టికెట్లను పొందగా.. ఆ ఆరు టికెట్లను రూ. 65 వేలకు అమ్ముకున్నారు.
అయితే శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో మోసం జరుగుతుందని.. బ్రేక్ దర్శన టికెట్లను అధిక ధరకు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారని ఓ భక్తుడు వైసీపీ ఎమ్మెల్సీపై టీటీడీ విజిలెన్స్ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. భక్తుడి ఫిర్యాదుతో విజిలెన్స్ వింగ్ అధికారులు విచారణ చేపట్టగా.. వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకోవడం నిజమేనని నిర్ధారణ అయింది.
దాంతో టీటీడీ విజిలెన్స్ వింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తిరుమల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్సీ జకియాఖానంపై కేసు నమోదైంది. ఏ1గా చంద్రశేఖర్ అనే వ్యక్తిని, ఏ2గా జకియాఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లు చేర్చారు. శ్రీవారి వీఐపీ దర్శన టికెట్ల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కాగా, గతంలో కూడా టీటీడీ టికెట్లను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని వైసీపీ నాయకులపై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇద్దరు మంత్రుల పేర్లు ఈ దందాలో బలంగా వినిపించాయి.