మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఒకప్పటిలా లేవని… ఎన్నో మార్పులు వచ్చాయని.. ఆ మార్పుల బట్టి తాను మారకపోవడంతో పాతతరం నాయకుడిలా మిగిలిపోయాయని అంటూ ఆయన ‘ఎమ్మెల్యేను ఎందుకయ్యానా?’ అని ఒక్కోసారి బాధ కలుగుతుందని అన్నారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని… తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని చెప్పిన ఆయన.. అనేక ఇతర అంశాలనూ ప్రస్తావించారు. సాధారణ ప్రజలకు సాయం చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పది మంది రౌడీలను వెంటేసుకుని తిరిగితేనే ఇప్పుడు నాయకుడు అంటున్నారు.. నేను ఆ పని చేయలేను, రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతకాకే పాతతరం నాయకుడిగా మిగిలిపోయాను అన్నారాయన. గత మూడున్నరేళ్ల కాలంలో తాను ఎవరిపైనా అక్రమంగా కేసులు పెట్టించలేదని ఆయన చెప్పారు.
కాగా వైసీపీ నుంచి గెలిచిన వసంత కృష్ణప్రసాద్ ఇటీవలే తమ పార్టీ తీరును తప్పు పట్టారు. గుంటూరులో ఎన్ఆర్ఐలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముగ్గురు మరణించిన ఘటన తరువాత ఆ కార్యక్రమం నిర్వహించిన ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌పై వైసీపీ నేతలు మాటల దాడి చేయడాన్ని కృష్ణప్రసాద్ తప్పుపట్టారు. సాయం చేస్తున్న ఎన్ఆర్ఐలను బెదిరించి కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయంగా వారు వేరే పార్టీలకు దగ్గరగా ఉన్నంతమాత్రాన వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదని కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు.
కాగా, మైలవరంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు మంత్రి జోగి రమేశ్ వర్గీయులకు మధ్య వివాదం నడుస్తోంది. మంత్రి తనకు నియోజకవర్గంలో సమస్యలు సృష్టిస్తున్నారని.. ఆయన ఓ వర్గాన్ని తయారుచేసుకుని తనకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వసంత ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆ జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఆయన ఫిర్యాదుచేశారు. అంతేకాదు.. వసంత, జోగిల పంచాయతీ సీఎం జగన్ వద్దకు కూడా వెళ్లింది. అయినా.. అక్కడ సమస్య మాత్రం చల్లారలేదు. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం అనేది ఆయన జోగి రమేశ్‌ను ఉద్దేశించి అన్నారని చెప్తున్నారు.