టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయం.. ఆ పార్టీ నేతలు సహా సమాజంలోని ఓ వర్గం ప్రజలను కూడా తీవ్రంగా బాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బంద్, నిరసనలకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అయితే, ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టుతో వైసీపీ నాయకులు కొందరు టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి. ఇక, కొందరు మంత్రులు కూడా చంద్రబాబు అరెస్టుపై రోజుల తరబడి తమ వ్యాఖ్యలు మీడియా ముందు వినిపించారు.
అయితే, తాజాగా వైసీపీలో మనసులో మాటను కీలక నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బయట పెట్టారు. “చంద్రబాబు జైలు పక్షి“ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. చంద్రబాబు గుడికి వెళ్లారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామంలో 72వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వసంత.. చంద్రబాబు కేసు, అరెస్ట్ గురించి స్పందించారు.
“సీఎం జగన్పై గతంలో కేసులు పెట్టారని.. అప్పుడు జగన్ పై కేసు పెడితే సక్రమం…ఇప్పుడు చంద్రబాబుపై పెడితే అక్రమమా?. జగన్ జైలుకెళ్లారని, ఆయన జైలు పక్షి అని టీడీపీ వాళ్ళు ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు గుడికి వెళ్ళారా? చంద్రబాబు కూడా జైలుకే వెళ్లారు.. చంద్రబాబు జైలుపక్షి కాదా“ అని వసంత వ్యాఖ్యానించారు.
చట్టబద్ధమైన సంస్థలు తమకు ఉన్న సమాచారం, సాక్ష్యాలను బట్టి చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు పెట్టాయని, చట్టప్రకారం అరెస్ట్ చేశాయని ఎమ్మెల్యే వసంత అన్నారు. దేశంలో మాజీ ముఖ్య మంత్రులు జయలలిత, లాలూప్రసాద్ యాదవ్ లాంటి వారిపై కూడా దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయన్నారు. ఎవరికి వారు చట్టబద్ధంగా ఆయా కేసులను ఎదుర్కొన్నారని అన్నారు. మొత్తానికి చంద్రబాబుపై కూడా `జైలు పక్షి` అని ముద్ర వేయాలన్న వైసీపీ మనసులో మాటను ఎమ్మెల్యే వసంత ఇలా బయట పెట్టడం చర్చనీయాంశంగా మారింది.