అధికార వైసీపీ ఎమ్మెల్యేల వైఖరులు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి. కొందరు అక్రమార్కు లతో చేతులు కలిపి.. అందిన కాడికి దోచుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల తాము అన్నీ అయి.. ఆధిపత్య రాజకీయాలకు తెరదీస్తున్నారని ఎమ్మెల్యేలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఎవరిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. అందరిదీ ఒక్కటే మాట.. తామంతా జగన్ దయతోనే గెలిచామని చెప్పుకొంటారు. జగన్ టికెట్ ఇవ్వకపోతే.. తమకు ఉనికి కూడా ఉండేది కాదని.. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట.
కానీ, వైసీపీ ఎమ్మెల్యేల్లో ఈ వ్యాఖ్యలకు భిన్నంగా నెల్లూరు జిల్లా గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ గళం విప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్.. గత 2014లో తిరుపతి ఎంపీగా విజయం సాధించారు. అక్కడ తీవ్ర ఆరోపణలు రావడం.. సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తడం.. నేతలను కలుపుకొని పోయే విధానం లేకపోవడం.. తాను ఐఏఎస్‌ను తాను చెప్పిందే వినాలనే వితండవాదన చేయడం.. కింది స్థాయి నేతలకు దూరంగా ఉండడం వంటి పరిణామాలు.. వరప్రసాద్‌కు స్థాన చలనం కలిగించేలా చేశాయి. వాస్తవానికి టికెట్ ఇవ్వకూడదనే ఒత్తిళ్లు కూడా వచ్చాయి.
అయితే, ఆయన తమిళనాడు కేడర్ ఐఏఎస్‌గా ఉన్న సమయంలో చెన్నైలో జగన్‌కు ఏవో మేళ్లు చేశారని సమాచారం. ఈ క్రమంలోనే జగన్ ఆయనను చూసీ చూడనట్టు వ్యవహరించి.. నెల్లూరు జిల్లా గూడురు టికెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. వాస్తవానికి తనకు బాధ్యతలు ఏవీ లేవంటారు. డౌన్ టు ఎర్త్ అనే సూత్రాన్ని కూడా పాటిస్తారు. కానీ, ఇటీవల కాలంలో ఆయన కూడా వసూళ్లకు పాల్పడుతున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి.
అయితే, ఇది నిజం కాదని.. జిల్లాలో ఓ మంత్రి వ్యవహార శైలితో వరప్రసాద్ విసిగిపోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల నేను జగన్ బొమ్మతో గెలవలేదు.. అని తీవ్ర వ్యాఖ్య కూడా చేసేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే సంచలనంగా మారాయి.
జగన్‌పై ఎంత కోపం ఉన్నా.. పార్టీలో ఎంత అసమ్మతి ఉన్నా.. చాలా మంది ఎమ్మెల్యేలు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎక్కడా నోరు జారడం లేదు. కానీ.. వరప్రసాద్ మాత్రం నాలిక తడబడ్డారు. ఎన్నికల ప్రచారం సమయంలోనూ ఆయన వింత వైఖరి అవలంభించారని.. తెల్లవారు జామున నాలుగు గంటలకే ఒంటరిగా వీధుల్లోకి వచ్చి.. నేను ఐఏఎస్‌ను.. నాకే ఓటేయాలి.. లేకపోతే.. మీరు భ్రష్టుపట్టిపోతారంటూ.. ప్రజలపై తిరగబడ్డారు.
అప్పట్లోనే ఆయన చిత్త చాంచల్యం ఉందనే విమర్శలు వచ్చాయి. ఇక, ఇప్పుడు ఏకంగా.. ఆయన జగన్‌పై విరుచుకుపడడం కూడా ఈ తరహాలోనిదేనని అంటున్నారు ఆయన అనుచరులు. దీంతో చర్చ సాగుతున్నా.. ఈ వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వక పోవడం గమనార్హం.