ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఏకైక రాజధాని అన్న నినాదంతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 2.0 దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు దీనిని అడ్డుకునేందుకు రకరకాల కుట్రలు పన్ని విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే విశాఖ రాజధాని కోసం రాజీనామా అంటూ వైసీపీ నేతలు కొత్త డ్రామాలకు తీశారు.
ఈ క్రమంలోనే తాజాగా విశాఖ రాజధాని కోసం వైసీపీ నేతలు కొత్త డ్రామాకు తెరతీశారు. విశాఖ కోసం అంటూ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా డ్రామాకు తెరతీయడం సంచలనం రేపింది. విశాఖ కోసం రాజీనామా చేస్తున్నానంటూ కరణం ధర్మశ్రీ రాజీనామా లేఖను కూడా సిద్ధం చేశారు. అయితే, కరణం ధర్మశ్రీ రాజీనామా ఉత్త బూటకం అని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. స్పీకర్ ఫార్మాట్ లో కాకుండా రాజీనామా చేస్తున్నట్టుగా ఒక లెటర్ హెడ్ పై ధర్మ శ్రీ రాజీనామా సమర్పించారు.
టిడిపికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నానంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో, కరణం ధర్మశ్రీ రాజీనామా డ్రామాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మశ్రీకి విశాఖ రాజధానిపై, మూడు రాజధానులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి దాన్ని ఆమోదించుకునే వారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
మరోవైపు, మూడు రాజధానులకు మద్దతుగా నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. అయితే, ఈ ర్యాలీలో ఉమాశంకర్ గణేశ్ బైక్ ను మరో బైక్ ఢీకొట్టడంతో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. ఆ కాలి గాయానికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.