ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. పేరుకు పార్టీ రహిత ఎన్నికలయినప్పటికీ….పంచాయతీ పోరులో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థిని బెదిరించారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేయగా…కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిమ్మాడలో అనుచరులు…ఆయుధాలతో వీరంగం వేసిన టెక్కలి వైసీపీ ఇన్ చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ను వదిలేసి…అచ్చెన్నను అరెస్టు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే, అధికార పార్టీకి చెందిన నేతలు బెదిరింపులకు పాల్పడుతూ అభ్యర్థులతో నామినేషన్ లు విత్ డ్రా చేయించి బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కానీ, వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ రెబల్ అభ్యర్థికి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు వార్నింగ్ ఇచ్చారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఓ అభ్యర్థి అల్లుడిని ఆయన బెదిరించారని ఓ ఆడియో క్లిప్ వెలుగులోకి రావడం కలకలం రేపింది.
రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ శివారులోని సీతాపాలెం క్గామానికి చెందిన లాలం సంతోష్ కుమార్ మామ.. వైసీపీ తరపున వార్డు మెంబర్ గా పోటీ చేయాలనుకున్నారు. అయితే, స్థానిక నేతలు ఆయన పోటీని వ్యతిరేకించడంతో రెబల్ గా నామినేషన్ వేశారు. దీంతో, సంతోష్ కు కన్నబాబు రాజు ఫోన్ చేసి నామినేషన్ వెనక్కి తీసుకోకుంటే కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే ఫోన్లో బెదిరిస్తున్న సంభాషణను రికార్డ్ చేసిన సంతోష్..,రాంబిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కాల్ రికార్డ్స్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరి, అచ్చెన్నపై చర్యలు తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు కన్నబాబు రాజును కూడా అరెస్టు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.