వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది. అధికార పార్టీని విపక్ష పార్టీ నేత తిట్టటం.. తీవ్రంగా విమర్శ చేయటం.. భారీ ఆరోపణల్ని సంధించటం మామూలే. అందుకు భిన్నంగా సొంత పార్టీ నేత నోటి నుంచి విమర్శలు.. ఆరోపణలు రావటం చాలా అరుదు. అందునా అధికారపార్టీలో ఉండి.. ప్రభుత్వాన్ని తప్పు పట్టటం మామూలు విషయం కాదు. కానీ.. ఇప్పుడు అదే పని చేసిన సంచలనంగా మారారు వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులుమరింత పెరిగినట్లుగా వ్యాఖ్యానించారు. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని.. ప్రత్యర్థుల్ని బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే..పార్టీ తీరు నచ్చక తాను.. తన అనుచరులు తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లుగా ఆయన చెబుతున్నారు. ఇంతకీ ఈ డేవిడ్ రాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లాకు చెందిన ఈ నేత తన పొలిటికల్ జర్నీని 1999లో టీడీపీ నుంచి షురూ చేశారు. అదే సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2009లో ఎర్రగొండపాలెం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ఆయన.. 2014లో వైసీపీలో చేరి ఎర్రగొండపాలెం నుంచి విజయం సాధించారు. ఆ సందర్భంగా 30 వేల ఓట్ల మెజార్టీని సొంతం చేసుకున్నారు.
అయితే.. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావటంతో.. ఆయన పార్టీలోకి చేరిపోయారు. 2019లో ఎర్రగొండపాలెం టికెట్ ను డేవిడ్ రాజుకు ఇవ్వని చంద్రబాబు.. వేరే వారికికేటాయించారు. దీంతో.. మనస్తాపానికి గురైన ఆయన వైసీపీలో చేరారు. తాజాగా.. అధికారపక్షం మీద సంచలన ఆరోపణలు.. విమర్శలు చేస్తున్న ఆయన టీడీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటివరకు పంచాయితీ ఎన్నికల్లో ఏపీ అధికారపక్షం దౌర్జన్యాలకు పాల్పడిందని.. ఏకగ్రీవాల కోసం తీవ్రంగా ప్రయత్నించిందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రత్యర్థులు మాత్రమే చేసిన విమర్శల్ని సొంత పార్టీ నేతలు చేయటంతో ఏపీ అధికారపక్షానికి మింగుడుపడనిదిగా మారిందని చెబుతున్నారు. మరి.. డేవిడ్ రాజుపై సీఎం జగన్మోహన్ ఎలాంటి చర్య తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.