ఏపీలో జగన్ పాలనపై విపక్షాలు ముందు నుంచి విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని జగన్…ప్రతిపక్ష నేతలపై కక్ష సాధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నా..పోలీసులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సొంతపార్టీపై, పోలీసులు తీరుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఏపీలో లోకల్ మాఫియా హవా గట్టిగా ఉందని, అయితే, ఆ మాఫియాల్లో పోలీసు శాఖ వారు కూడా చేతులుకలిపి ఉన్నారని ఆనం షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే, రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందని, లోకల్ మాఫియా జోరు తగ్గాలని అన్నారు. పోలీసులు న్యాయం చేస్తారని ప్రజల్లో ఒక నమ్మకం, భరోసా ఉందని, కానీ, అటువంటి పోలీసులే మాఫియాల్లో కలిస్తే రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఏముంటుందని ప్రశ్నించారు. వ్యవస్థను బలోపేతం చేయాలంటే కలుపు మొక్కలను తీసివేయాలని ఆనం అన్నారు.
అయితే, పోలీసుల తీరుపై ఇలా కామెంట్లు చేసిన వారిలో ఆనం మొదటి వారు కాదు. గతంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా పోలీసులపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులపై పోలీసులు కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చేతనైతే ధాన్యం కొనని మిల్లర్లపైనా, దళారులపైనా కేసులు పెట్టాలని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు అనిల్, గౌతమ్ రెడ్డిల సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.