అది ఒక అత్యంత శక్తిమంతమైన దేవుడి విగ్రహం…ఆ విగ్రహం సొంతం చేసుకున్నవారి దశ దిశ తిరిగిపోతుంది…బ్లాక్ మార్కెట్లో కోట్లు పలికే ఆ విగ్రహాన్ని బేరం పెట్టే స్మగ్లింగ్ ముఠా…కోట్లు చెల్లించైనా ఆ విగ్రహాన్ని…దాని ద్వారా వచ్చే అదృష్టాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించే రాజకీయ నాయకులు…ఈ మధ్యలో ఎలాగోలా ఆ విగ్రహాన్ని, దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీసులు…ఈ నేపథ్యంలో బోలెడన్ని తెలుగు సినిమాలు వచ్చాయి.
అయితే, రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఇదే టైపు సీన్లు ప్రకాశం జిల్లాలో జరిగాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అత్యంత విలువైన, మహిమ గల ‘మరకత పచ్చ పంచముఖ గణేశుడి’ పురాతన విగ్రహం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రెండున్నర అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పుతో 90 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని కొందరు రూ.25 కోట్లకు బేరం పెట్టారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఒంగోలు క్రైం బ్రాంచి పోలీసులు…తామే కొనుగోలుదారులుగా వెళ్లి ఆ ముఠాను, విగ్రహాన్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే,ఈ విగ్రహం వ్యవహారంలో ఇద్దరు మంత్రులు తలదూర్చారన్న ప్రచారం జరగడంతో ఈ విషయం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఈ నెల 10న క్రైం బ్రాంచి పోలీసులు ఆ విగ్రహం స్వాధీనం చేసుకొని ఒంగోలు లోకల్ పోలీసులకు అప్పగించారు. అయితే, ఈ విషయంపై వారు ఒక రోజు ఆలస్యంగా కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తో్ంది. ఆ విగ్రహం రూ.కోట్ల విలువైందని ప్రచారం జరగడంతో ఇద్దరు మంత్రులు రంగప్రవేశం చేశారని, దీంతో పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి.
గతంలో ఈ విగ్రహం తమదేనంటూ కొందరు కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారని, అవి ఉండటంతో స్థానిక పోలీసులకు విగ్రహాన్ని అప్పగించి వచ్చేసినట్లు ఒంగోలు క్రైం బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. విగ్రహానికి సంబంధించిన పత్రాలను చూపించి ఆ విగ్రహం తమదని నిరూపించుకోవాలని నిందితులకు పోలీసులు వారం సమయం ఇవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ వాళ్లు కొల్లగొట్టిన హిందూ దేవుళ్ల విగ్రహాల్లో ఇది ఒకటి మాత్రమేనని లోకేశ్ ఆరోపించారు. ప్రకాశం జిల్లాలోని వైసీపీ నేత వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో మరకత వినాయకుడి రూపంలో ఒక విగ్రహం బయటపడిందని, ఇంకా మిగతా వైసీపీ నేతల ఇళ్లలో ఎన్ని విగ్రహాలున్నాయోనని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రజలకే కాదు, దేవాలయ ఆస్తులు, విగ్రహాలకూ రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలోని ఆలయాల్లో కేంద్ర బృందం పర్యవేక్షణలో తనిఖీలు జరిపించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.