వచ్చే ఎన్నికల్లో `వైనాట్ 175` అంటున్న వైసీపీ 17 స్థానాల్లో గెలిస్తే ఎక్కువని టీడీపీ అదినేత నారా చంద్రబాబు తమ్ముడు కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామంటూ వైసీపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తన సోదరుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 50వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో.. రోహిత్ ఆ యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో రోహిత్ పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది.
ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ డిఫెన్స్‌లో పడిందని.. అందుకే తెలుగుదేశం పార్టీపై బురదజల్లుతున్నారని విమర్శించారు. యువగళం పాదయాత్ర మున్ముందు ప్రభంజనం రేపుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని వ్యాఖ్యానించారు. అన్ని విషయాలను జూనియర్ ఎన్టీఆర్ పరిశీలిస్తున్నారని.. పైకి ఆయన సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. పొలిటికల్‌గా మాత్రం మంచి పరిజ్ఞానం ఉందని చెప్పారు.
కాగా.. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో యువనేత 50వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగనుంది. మూడు రోజుల విరామం తరువాత శనివారం ఉదయం పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు ఒనుకువారిపల్లి విడిది కేంద్రంలో సెల్పీవిత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి లోకేష్ సెల్ఫీ ఇస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి ఫోటోలు దిగుతున్నారు.
ఖైదీ నెం.6093ని జైలు రమ్మంటోంది: నారా లోకేష్ ఫైర్
ఒక్క ఛాన్స్ అని ఏపీని జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. జగన్‌ను తల్లి, చెల్లి, ప్రజలు ఎవరూ నమ్మడం లేదని విమర్శించారు. సొంత ఎమ్మెల్యేలు కూడా జగన్‌ను నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ పనైపోయిందని, ఖైదీ నెం.6093ని జైలు రమ్మంటోందన్నారు. జాబ్ క్యాపిటల్‌గా ఉన్న ఏపీని గంజాయి క్యాపిటల్‌గా మార్చేశారని ద్వజమత్తారు. జగన్ కుడి చేత్తో రూ.10 ఇచ్చి ఎడమ చేత్తో రూ.100 దోచేస్తున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని యువతను జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రతిఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని భరోసా ఇచ్చారు.