ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూల వర్గాలుగా కొన్ని, అనుకూల ప్రాంతాలుగా కొన్ని ఉన్నాయి. అవి ఆది నుంచి కూడా జగన్కు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. వీటిలో కులాలు.. మతాలే కాదు.. ప్రాంతాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు, విజయనగరం, అనంతపురం వంటివి.. వైసీపీకి ప్రాంతాల పరంగా దన్నుగా నిలుస్తున్నాయి. ఇక, సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే.. ఎస్సీ, ఎస్టీలు వైసీపీకి ఎప్పుడూ అండగా నిలిచాయి.
వైఎస్ హయాంలో చేసిన పనులు కావొచ్చు.. తీసుకున్న నిర్ణయాలు కావొచ్చు.. లేదా.. సంక్షేమ పథకాలు కావొచ్చు.. ఏదైనా కూడా ఆయా వర్గాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.. అనే కన్నా.. ఆ వర్గాలు వైసీపీకి అనుకూలంగా మారాయనే చెప్పాలి. ఇక, మైనారిటీలు.. ఒకప్పుడు లౌకిక వాదన వినిపించిన.. కాంగ్రెస్ వైపు పరుగులు పెట్టాయి. కానీ… తర్వాత.. కాలంలో వారికి 4 శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిన రాజశేఖర రెడ్డి వైపు మళ్లాయి. తర్వాత.. ఆయా వర్గాలే.. వైసీపీకి అండగా నిలిచాయి.
ఇక, రెడ్డి సామాజిక వర్గం ఆది నుంచి కూడా.. రాజశేఖరరెడ్డి వైపు నిలిచింది. సో.. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. రెడ్డి వర్గమే జగన్ను గత ఎన్నికల్లో అండగా నిలిచింది. అయితే.. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే.. ఈ నాలుగేళ్లలో సీఎం జగన్ పాలన తర్వాత.. ఈ వర్గాలు ఎటు ఉన్నాయి? వైసీపీ వైపు నిబద్ధతతోనే కొనసాగుతున్నా యా? వచ్చే ఎన్నికలు కీలకమైనవి కావడంతో వైసీపీకి అండగా ఉంటాయా? అనేది చర్చకు వస్తోంది.
ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకున్నా.. వైసీపీ ఒంటరిగానే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని అన్ని విధాలా ఆదుకునేది ఈ వర్గాలే. ఈ ప్రాంతాలే. మరి ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు.. ప్రాంతాలను పరిశీలిస్తే.. ఒకింత విస్మయం వ్యక్తం అవుతోంది. నిష్కర్షగా చెప్పాలంటే.. నిర్మొహమాటంగా చెప్పాలంటే.. 2019కి ముందు ఉన్న పరిస్థితి అయితే.. ఇప్పుడు లేదు. దీనిని బట్టి వైసీపీ తన పంథాను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతం అయితే.. `కులాలు-ప్రాంతాలు.. వైసీపీకి ఎంతెంత దూరం అంటే.. ఈ నాలుగేళ్ల పాలన తర్వాత.. చాలాచాలా దూరమయ్యారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.