ఎక్కడైనా జిల్లాను అభివృద్ధి చేసేందుకు మంత్రులు ఉత్సాహం చూపిస్తారు. పైగా తాము పుట్టిపెరిగిన జిల్లా.. రాజకీయంగా తమకు భిక్ష పెట్టిన జిల్లాను అభివృద్ది పథంలో దూసుకుపోయేలా చేయాలని చూస్తారు. కానీ, వైసీపీ సర్కారు హయాంలో మాత్రం ఇద్దరు మంత్రులు తమ సొంత జిల్లాను వ్యక్తిగత రాజకీయాల కోసం పంచేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాజకీయంగా తమకు తిరుగులేకుండా.. పంపకాల పరంగా తమకు ఎవరూ అడ్డు చెప్పకుండా చూసుకునేందుకు.. మరీ ముఖ్యంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు, వివాదాలు తలెత్తకుండా చూసుకునేందుకు ఈ మంత్రులు జిల్లాను పంచుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ విషయాన్ని సాధారణ ప్రజలు కాదు.. వైసీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలే బాహాటంగా చెప్పుకొస్తుండ డం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరొకరు.. ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి. వీరిద్దరికీ .. రాజకీయాలు కొట్టిన పిండి! గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి నారాయణ స్వా మి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరికి జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే జిల్లాకు శాపంగా మారిందనే వ్యాఖ్యలు వినిపించేలా చేస్తోంది. వీరిద్దరూ కూడా జిల్లాను చెరిసగం పంచుకుని చక్రం తిప్పుతున్నారట!
నగరి, తిరుపతి, పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, కుప్పం సహా పలు నియోజకవర్గాలను పెద్దిరెడ్డి తన అధీనంలోకి తెచ్చుకు న్నారు. ఇక, తంబళ్లపల్లె, పూతలపట్టు, సత్యవేడు తదితర నియోజకవర్గాలను మంత్రి నారాయణ స్వామి తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. ఇక్కడ ఏంజరగాలన్నా.. వీరు అనుమతిం చాల్సిందే. అంతేకాదు, అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు నామ్ కేవాస్తే.. అన్నట్టుగా మారిపోయారనే టాక్ కొన్నాళ్లుగా వినిపిస్తోంది. మంత్రి నారాయణ స్వామి దూకుడుతో .. సత్యవేడు ఎమ్మెల్యే సైలెంట్ అయిపోయారు. ఇక, పూతలపట్టు పరిస్థితి కూడా అలానే ఉంది.
ఒక్క చంద్రగిరి, నగరి, తిరుపతి నియోజకవర్గాల్లో మాత్రమే.. ఎమ్మెల్యేలు కొంత స్వతంత్రంగా ఉన్నారని.. మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా ఇద్దరు మంత్రుల కనుసన్నల్లోనే ఉన్నాయని ఇక్కడి ఎమ్మెల్యేలు లబోదిబో మంటున్నారు. ఫలితంగా తాము ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోతోందని, తాము ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలూ చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, వీరి గోడు వినిపించుకునే నాథుడు కనిపించకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే.. క్షేత్రస్థాయిలో పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.