ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య ఒక ఆసక్తికర విషయం చర్చగా మారింది. పైకి బహిరంగంగా చెప్పలేక.. లోలోన దిగమింగ లేక.. సతమవుతున్నారు. ఎవరైనా.. అత్యంత విశ్వాసపాత్రులైన మంత్రులో.. ఎమ్మెల్యేలో కలిస్తే.. వారి వద్ద మాత్రమే మనసు విప్పుతున్నారు.. గొంతు సవరిస్తున్నారు. ఈ జాబితాలో మీడియా ప్రతినిధులు కూడా ఉండడం గమనార్హం. సరే! ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల సభలో వరుసగా రెండు కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒకటి మూడు రాజధానులు.. రెండు శాసన మండలి. ఈ రెండు విషయాల్లోనూ ముందున్న దూకుడు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. మండలి రద్దు చేయాలని చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు.
మళ్లీ మండలిని కొనసాగించాలని తీర్మానం చేశారు. బిల్లును ఉభయ సభలు కూడా ఆమోదించాయి. అయితే.. ఇది ఎంత వరకు ప్రజల్లోకి పాజిటివ్‌గా వెళ్తుందనేది ఇప్పడు ప్రధాన సమస్య. “మా నాయకుడు తీసుకునే నిర్ణయాలను మేం సమర్ధిస్తాం. మాకు తప్పదు. ఆయన టికెట్ ఇచ్చారు. గెలిచాం. కాబట్టి.. ఆయన ఎలాంటి అడుగులు వేసినా.. మడుగులు వత్తుతాం. కానీ రేపు ప్రజలకు ఏం చెప్పాలి? మా మొహాలు చూపించలేక పోతున్నాం“ అని విశాఖకు చెందిన ఓ సీనియర్ నాయకులు మీడియా మిత్రుల ముందే అన్నారు. ఇక, ఇదే తరహాలో అనంతపురం ప్రాంతానికి చెందిన నాయకులు వ్యాఖ్యానించారు. జగన్ చేసిన పనులను ఇప్పటికేసమర్థించామని.. ఇప్పుడు ఎన్నని సమర్ధిస్తామని.. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“మీకు తెలీంది ఏముందబ్బా! మా జిల్లాలో.. ప్రతిపక్షం దూకుడు ఎక్కువ. అయినా.. గత ఎన్నికల్లో మేం విజయం దక్కించుకు న్నాం. కానీ, ఇప్పుడు అన్నీ రివర్స్ అంటున్నారు. ప్రజల్లోకి మేం వెళ్లేలోపే.. మాకు యాంటీ ప్రచారం జరిగిపోతోంది. ఎన్నని సమర్ధించుకుంటాం. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కదా! ఒకప్పుడు టీవీలు లేని రోజుల్లో అంటే.. ఇలా చేసినా బాగుండేది.. కానీ.. ఇప్పుడు కుదురుతుందా? “ అని.. అనంతపురంలోని ఓ కీలక నియోజకవర్గం నాయకుడు(ఇక్కడ టీడీపీ వరుస విజయాలు దక్కించుకుంది. గత ఎన్నికల్లో తొలిసారి వైసీపీ విజయం సాధించింది.) వ్యాఖ్యానించారు. ఇక, ఇదే విషయాన్ని పలు జిల్లాల నాయకులు చూచాయగా ఇలానే వ్యాఖ్యానించారు.
వెనక్కి తీసుకోవడం మంచిదే అన్న నాయకులు కనిపించకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని .. మీరు అధినేత ముందుకు తీసుకువెళ్లొచ్చుగా, అని మీడియా మిత్రులు అడిగితే.. ఆ నాయకులు చప్పున అక్కడ నుంచి తప్పుకోవడం గమనార్హం. ఇక, మంత్రుల విషయానికి వస్తే.. వారు నేరుగా మీడియాతో ఏం మాట్లాడినా.. మా నాయకుడు చేసింది కరెక్టే అంటున్నారు. కానీ, లోలోన మాత్రం సతమతం అవుతున్నారు. “ఏదో ఒక విషయంలో ఇరుక్కుపోతున్నాం“ అనే మాట తూర్పుగోదావరికి చెందిన ఒక కీలక మంత్రి వ్యాఖ్యానించారు. ఆ `విషయం` ఏంటని అడిగితే.. మాత్రం ఆయన కూడా మౌనం వహిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. అసెంబ్లీలో జరిగిన రెండు అంశాలపైనా.. వైసీపీనాయకుల గుసగుస ఇంకా కొనసాగుతుండడం గమనార్హం.