ఆంధ్రావనిలో ప్రధానంగా రాజకీయం నడుపుతున్న 2 పార్టీలను ఎప్పటికప్పుడు ఓ సమస్య వేధిస్తోంది. అధికారంలో ఉన్నంత వరకూ అంతా బాగానే ఉన్నా, తరువాత మాత్రం సంబంధిత నాయకులకు చుక్కలు కనపడుతున్నాయి.మళ్లీ కోల్పోయిన అధికారం రావాలంటే ప్రజా ఉద్యమాలే శిరోధార్యం అని భావించి, అంతిమం అని నిర్ణయించి పోరాటాలు చేయాల్సి వస్తోంది. ఓ విధంగా ఇది పోరాటం అని చెప్పే కన్నా జీవన్మరణ పోరాటం అని రాయాలి. ఈ విధంగా టీడీపీ కానీ ఈ విధంగా వైసీపీ కానీ ఎదుర్కొంటున్న లేదా ఎదుర్కొనబోయే సమస్యే ఇది.
వాస్తవానికి అధికారంలో ఉండగా రెచ్చిపోయి మాట్లాడిన నాయకులు తరువాత కేసులంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మాఫియాలో వాటాలు అందుకున్న వారు తరువాత కాలంలో చుక్కలు చూస్తున్నారు. అధికారంలో ఉండగా బండ బూతులు తిట్టినవారు తరువాత జైలు జీవితం అనుభవించాల్సి వస్తోంది. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గంనే తీసుకుందాం.
ఇప్పుడంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను స్థాయి మరిచి, హద్దు విడిచి తిడుతున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనే కాదు ఆ రోజు అధికారంలో ఉన్న విప్ హోదాను అందుకున్న చింతమనేని కూడా ఇలానే రెచ్చిపోయారు అన్న వాస్తవ ఘటనలు ఉన్నాయి. నిరూపణలూ ఉన్నాయి. అదేవిధంగా విప్ హోదాలో ఉన్న కూన రవి కూడా అప్పుడు అలానే రెచ్చిపోయారన్న విమర్శలూ ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన విపక్ష పార్టీ గ్రానైట్ దందాలపై మాట్లాడుతున్న వైసీపీ నాయకులంతా ఒకప్పుడు ఏమయ్యారు ? అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమయినప్పటికీ ఇసుక, గ్రానైట్, మట్టి రవాణా అన్నది నిబంధనలకు విరుద్ధంగానే తరలిపోతున్నాయి.
పార్టీల అధినేతలు వాటిని నియంత్రించలేకపోతున్నారు అన్నది కూడా వాస్తవం. ఇదే సమయంలో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా ప్రభుత్వాలు చూపని చొరవ కారణంగా నిర్వాసితులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఇవి కూడా తరువాత కాలంలో పాలక పక్షాల ఓటములకు కారణం అవుతున్నాయి. కనుక అధికారంలో ఉన్నంత కాలం తక్కువ తప్పులు చేస్తే మళ్లీ మళ్లీ ప్రజలు పాలించే అధికారం తప్పక సంబంధిత నాయకులకు అప్పగిస్తారు. లేదంటే సమస్యలు తప్పవు..వేధింపు రాజకీయాలూ..కక్ష పూరిత ధోరణిలో భాగంగా కేసులు, దర్యాప్తులు, జైలు జీవితాలు కూడా తప్పవు..అన్నది పరిశీలకుల మాట.
Comments 1