అరె.. చిందెయ్యి.. చిందెయ్యి శివలింగా అంటూ.. ఓ సినిమాలో మోహన్‌బాబు పాడిన పాట గుర్తుందా? అచ్చు అలానే వైసీపీ నాయకులు (వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు) సాక్షాత్తూ శివాలయంలోనే చిందేశారు. అది కూడా ఒంటరిగా వేస్తే.. ఏం బాగుంటుందని అనుకున్నారో ఏమో.. అమ్మాయిలను కూడా పెట్టుకుని తైతక్కలాడారు. దీనికి వారు సంప్రదాయం అనే ముసుగు తొడిగేశారు. అయితే.. భక్తులు మాత్రం చీదరించుకున్నారు. ఇక, పోలీసులు.. వచ్చిన అవకాశం మిస్ చేసుకుంటే బాగుండదేమో నని.. చూస్తూ ఎంజాయ్ చేశారనే వ్యాఖ్యలు వినిపించాయి.
ఏం జరిగిందంటే..
నెల్లూరు జిల్లాలో సంగంలోని ప్రసిద్ధ కామాక్షి దేవీ సమేత సంగమేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఏకాంత సేవ నిర్వహించారు. ఈ ఏకాంత సేవ కూడా భారీ ఎత్తున చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం యువతులతో రికార్డింగ్ డాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫాస్ట్ బీట్ సాంగ్స్‌కు వారు స్టెప్పులు వేశారు.
ఆ రికార్డింగ్ డాన్స్‌లో యువతులతో కలిసి ఆలయ కమిటీ చైర్మెన్ పెరుమాళ్లా రవీంద్ర బాబు, వైసీపీ నాయకులు(వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు) కొందరు కలిసి చిందులు వేశారు. దేవాలయ ప్రాంగణంలో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడం.. వారితో అధికారులే ఇలా చిందులు వేయడం వల్ల బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు చీదరించుకున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆలయాల్లో ఇలా రికార్డింగ్ డాన్స్‌లు నిర్వహిస్తుంటే పోలీసులు పట్టించుకోవటం లేదని పలు విమర్శించారు. అయితే.. ఈ విషయంపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో వైసీపీ నాయకులు తప్పించుకు తిరగడం గమనార్హం.