ఏపీలో జంగారెడ్డి గూడెం నాటుసారా మృతుల వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. 4 రోజుల గ్యాప్ లోనే నాటుసారా తాగి 18 మంది మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. అంతేకాదు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనూ ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే నాటుసారా తాగి మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు నేడు పరామర్శించనున్నారు.
అయితే, చంద్రబాబు పర్యటనను విఫలం చేయడానికి వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న రాత్రి బాధితుల ఇళ్లకు వెళ్లిన వైసీపీ వాలంటీర్లు చంద్రబాబును కలవవద్దంటూ ఒత్తిడి చేశారని తెలుస్తోంది. ఏలూరు కలక్టరేట్కు వెళితే అక్కడ రూ. 10 లక్షలు ఇస్తారని బాధితుల కుటుంబ సభ్యలను ప్రలోభపెట్టారని తెలుస్తోంది. అయితే, వాలంటీర్ల మాటలు ఖాతరు చేయని బాధితులు కుటుంబ సభ్యులు…తాము చంద్రబాబును కలిసే తీరతామని స్పష్టం చేశారు.
మరోవైపు, చంద్రబాబు జంగారెడ్డిగూడెం పర్యటన నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. బాధిత కుటుంబాలను వైసీపీ నాయకులు ఏలూరుకు తరలించినట్లు తెలుస్తోంది. జీలిగుమిల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికేట్ ఏర్పాటు చేసిన పోలీసులు…జంగారెడ్డి గూడేనికి రాకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పర్యటనకు బయలుదేరే ముందు, జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. నాటుసారా, కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కల్తీసారా కారణంగా అనేకమంది చనిపోతున్నారని, రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే ప్రాణాలు పోతున్నా స్పందించదా? అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.