సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలు మొదలు సామాన్యుల వరకు అందరిపై వైసీపీ నేతల దౌర్జన్యాలు, దాష్టీకాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు, విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన బడా నేతలు మొదలు ఛోటామోటా నేతల వరకు…ఎవరికి ఎదురు చెప్పినా దాడులకు తెగబడడం నిత్యకృత్యంగా మారింది. ఈ క్రమంలోనే కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్‌పై వైసీపీ నేతల దాడి వ్యవహారం పెను దుమారం రేపింది.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుపై బైక్ నిలిపి ఉంచడంతో అటువైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ కొట్టారు. అయితే, ఆ బైక్ అధికార పార్టీకి చెందిన నేతది కావడంతో..వైసీపీ నేతలు ఆగ్రహానికి గురై డ్రైవర్ పై దాడికి దిగారు. నడిరోడ్డుపై కింద పడేసి ఆ డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సైకో జగన్ ఫ్యాక్షన్ ప్రదేశ్‌గా మారిపోయిందని, సైకో జగన్ పోతేనే ఇలాంటి పిల్ల సైకో గ్యాంగులన్నీ పోతాయని అన్నారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుందని చెప్పారు.
అవినీతి ధందాలకు అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని, తన అవినీతి ధందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ని ఆ పార్టీ అధినేత వేసేస్తే.. ఆయన సైకో ఫ్యాన్స్ హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై పట్టపగలు వైసీపీ నేతలు గూండాల కంటే ఘోరంగా దాడి చేశారని మండిపడ్డారు. బస్సు డ్రైవర్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక, ఈ ఘటనపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. వైసీపీ అరాచకానికి కావలి ఘటనే నిదర్శనమని, వైసీపీ పాలనలో అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట వినిపించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి అహంకారం తోడైందని, అందుకే వైసీపీతో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీద, ఉద్యోగుల మీద జులుం చేస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు. ఆ అరాచకాన్ని చిత్రీకరించిన వారిని బెదిరించారని, దీంతో, ఆ గూండాలకు బలమైన అండ ఉందని అర్థమవుతోందని అన్నారు. హారన్ కొట్టడం, సైకిల్ మీద తిరగడం, రోడ్డు మీద నడవడం కూడా నేరాలుగా పరిగణిస్తూ చట్టాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదదంటూ చురకలంటించారు.