పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం కుంభకోణంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట నిర్మించిన గోదాముల్లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు అధికారులు నిగ్గు తేల్చారు. ఈ వ్యవహారంలో పేర్ని నాని, పేర్ని జయసుధతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పేర్ని నాని హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోగా.. ఆయన భార్యకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే పేర్ని జయసుధ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం మచిలీపట్నంలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. జైలుకైనా వెళ్తాం.. కేసులకు భయపడమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ మరెవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టడం లేదంటూ వాపోయారు.
సివిల్ సప్లై మంత్రి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా.. ఉపముఖ్యమంత్రి సీజ్ ది షిప్, సీజ్ ది గోడౌన్ అన్నా.. ఎవరిపైనా క్రిమినల్ కేసులు నమోదు కాలేదని.. కేవలం వాళ్లపై 6ఏ కేసు మాత్రమే పెట్టి ఊరుకున్నారని పేర్ని నాని ఆరోపించారు. కక్ష కట్టే తనను, తన భార్యను, తన కొడుకుని కేసులతో వేధిస్తున్నారని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని, అవసరమైతే జైలుకైనా వెళ్తామని పేర్నే నాని పేర్కొన్నారు. వైసీపీని వీడం.. కేసులకు భయపడమని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.