వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మరో నెల రోజుల పాటు ముంబైలోని ఉండబోతున్నారు. ప్రస్తుతం ఏషియన్ హార్ట్‌కేర్ ఇన్స్టిట్యూట్లో ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. గత నెలలో గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ కొడాలి నాని గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొడాలి గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. స్టంట్ లేదా బైపాస్ సర్జరీని సూచించారు.
ఈ నేపథ్యంలోనే కుటుంబసభ్యులు కొడాలి నానిని మెరుగైన చికిత్స నిమిత్తం ముంబైకి తరలించారు. ముంబైలోని ఏషియన్ హార్ట్‌కేర్ ఇనిస్టిట్యూట్‌లో ఏప్రిల్ 2వ తేదీన కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరిగింది. ఆసుపత్రి చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే దాదాపు 8 నుంచి 10 గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఈ విషయాన్ని కృష్ణా జిల్లా వైసీపీ ఉపధ్యక్షుడు మండలి హనుమంతరావు ధృవీకరించారు.
కొన్ని రోజులపాటు కొడాలి నాని ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని.. ఆయన అవయవాలన్నీ సరిగ్గానే పనిచేస్తున్నట్లు వైద్యులు తెలిపారని హనుమంతరావు వెల్లడించారు. అలాగే మరో నెల రోజులపాటు కొడాలి ముంబైలోనే ఉంటారని పేర్కొన్నారు. ఇక బైపాస్ సర్జరీ విజయవంతం కావడంతో కొడాలి అనుచరులు మరియు వైసీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఆయన తిరిగిరావాలని ఆకాక్షిస్తున్నారు.