“ఔను.. వైసీపీది సామాజిక అన్యాయం. తెల్లారి లేస్తే.. వైసీపీ నేతలు సామాజిక న్యాయం గురించి ఊకదంపు డు ఉపన్యాసాలు దంచికొడతారు. కానీ, వారు పాలనా పరంగా చేసేది మాత్రం సామాజిక అన్యాయం“ అని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు. లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో ఆయన పాదయాత్ర చేస్తున్నారు.
యాత్రలో భాగంగా ప్రజల నుంచి నారా లోకేష్ విజ్ఞప్తులను స్వీకరించారు. అదేసమయంలో మధ్యలో నిర్మాణాలు నిలిపివేసిన కురుబ, వాల్మీకి వర్గాలకు చెందిన సామాజిక భవనాలను ఆయన పరిశీలించారు. ఈ భవనాలను పూర్తి చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వివరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వివిధ వర్గాల ప్రజలకు రుణాలు, రాయితీలు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
గత టీడీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నామని చెప్పారు. సామాజిక న్యాయం గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, కానీ, వారు చేసేది మాత్రం సామాజిక అన్యాయమేనని నిప్పులు చెరిగారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటిగా ఉందని వ్యాఖ్యానించారు. తాడేపల్లి ప్యాలెస్లో ఎవరుంటారో మీకు తెలుసా..? అని సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు. నలుగురురెడ్లు ఉన్నారని చెప్పారు.
మొదట ప్రజల్లో చైతన్యం రావాలని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజలకు కావాల్సినవి చేసే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉదన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చి.. ఒక్క ఛాన్స్ అంటూ అందలమెక్కిన జగన్ను ఇంటికి పంపించేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.