అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల….కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ….ఈ మాటలను వైసీపీ నేతలు బాగా వంటబట్టించుకున్నట్లు కనిపిస్తోంది. చెట్టు, పుట్ట, కరెంటు స్తంభం, బోరింగు…కావేవీ వైసీపీ రంగులకనర్హం అని వైసీపీ నేతలు జగనన్న జమానాలో నయా కవులుగా మారుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయొద్దు మొర్రో అని కోర్టు మొత్తుకుంటున్నా…వైసీపీ నేతల చెవులకెక్కడం లేదు. వైసీపీ రంగులొద్దన్నారని…దానికి దగ్గరగా ఉంటే రంగులకు మార్చాలని చూసిన వైసీపీ నేతలు గతంలో భంగపడ్డారు. అసలు కార్యాలయాలకు పూర్తిగా వైసీపీ రంగులు తీసివేయాలని కోర్టు గట్టిగా చెప్పడంతో సద్దుమణిగారు.
ప్రభుత్వకార్యాలయాలకు రంగులను పూర్తిగా తీసివేయడంతో వైసీపీ నేతల ఇగో హర్ట్ అయింది. దీంతో, ఎలాగైనా వైసీపీ రంగులు వేసి తమ పంతం నెగ్గించుకోవాలనుకున్న వైసీపీ నేతల్లో కొందరు ఆ ప్రక్రియలో సఫలమయ్యారు కూడా. శ్రీకాళహస్తిలో చెట్లు, పుట్టలు, గట్టులు, కరెంటు స్తంభాలు, ఆఖరికి బోరింగులు…ఇలా ఒకటేమిటి…రోడ్డుకు ఇరువైపులా కనిపించిన వస్తువులలో చాలావాటిని నీలిమయం చేసేశారు స్థానిక వైసీపీ నేతలు. ఇలా కనిపించిన ప్రతి వస్తువుకు వైసీపీ రంగుతో స్నానం చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆల్రెడీ శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కాలనీ వద్ద జగనన్న కాలనీలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తన గురుభక్తిని చాటుకుంటూ సీఎం జగన్ పేరిట నవరత్నాల నిలయాన్ని నిర్మించడంపై చర్చ జరుగుతోంది.
వారం రోజుల క్రితం ఈ నిలయాన్ని ప్రారంభించిన మధుసూదన్ రెడ్డి…ఆ తర్వాత రెండు రోజులకు ఈ నిలయంలోని అద్దాల మహల్‌ను ప్రారంభించి స్వామిభక్తిని చాటుకున్నారు. ఇక, జగన్ విగ్రహం పెట్టి తనకు సీఎం అంటే ఎంత ప్రేమో చాటుకున్నారు. మరి, ఎమ్మెల్యే ఆ రేంజ్ లో జగన్ ను కాకాపడితే…..స్థానిక నేతలు తమ ఎమ్మెల్యేను, జగన్ ను కాకా పట్టేందుకు ఈ రెండు కార్యక్రమాలను పురష్కరించుకుని నగరంలో పురపాలక సంఘం కార్యాలయం నుంచి రాజీవ్ నగర్ కాలనీ వరకు వైసీపీ రంగులతో నింపేశారు. మరి, ఈ వ్యవహారంపై మధు సూదన్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.